23 తర్వాత చంద్రబాబు పరిస్ధితేంటో ?

ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలతో  23 కౌంటింగ్ ఫలితాలపై అందరికీ అంచనా వచ్చేసింది. కాకపోతే 23 తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరగబోయే రాజకీయ పరిణామాలపైనే ఇపుడు చర్చలు ఊపందుకున్నాయి. నాలుగేళ్ళు ఎన్డీఏతో కాపురం చేసిన తర్వాత బయటకు వచ్చేసిన చంద్రబాబు నరేంద్రమోడిపై ఏ స్ధాయిలో విరుచుకుపడ్డారో అందరూ చూసిందే.

మోడితో పోల్చుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనటం చంద్రబాబుకు తేలికే. ఎందుకంటే చంద్రబాబుకు అపారమైన జాతి మీడియా బలముంది. జగన్ పై బురద చల్లించటం చంద్రబాబుకు చాలా తేలిక. కానీ కేంద్రంలో మోడితో పెట్టుకుంటే పరిస్ధితులు ఎలాగుంటుందో ఇప్పటికే చంద్రబాబు కాస్త టేస్ట్ చేశారు. రాష్ట్రంలో తానే అధికారంలోకి వస్తే మోడిని ఏదోలా ఢీ కొనవచ్చని చంద్రబాబు అనుకున్నారు.

కానీ రాష్ట్రంలో టిడిపి ఓడిపోయి కేంద్రంలో మళ్ళీ మోడినే ప్రధాని అయితే మాత్రం చంద్రబాబు పరిస్ధితి చాలా దుర్భరంగా మారిపోతుంది. మోడి విషయాన్ని పక్కనపెడితే వైసిపిదే రాష్ట్రంలో అధికారం అని దాదపు ఏడాదిన్నర నుండే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర ముగిసే నాటికి సంకేతాలు మరింత బలోపేతమయ్యాయి.  చివరకు ఎగ్జిట్ పోల్ సర్వేతో అందరి అంచనాలు దాదాపు ఖాయమైనట్లే.

అధికారంలో ఉన్నపుడే  జగన్ ను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయారు చంద్రబాబు. మరి రేపటి కౌంటింగ్ లో ఓడిపోయిన తర్వాత జగన్ సిఎం అయి కేంద్రంలో మోడి ప్రధానమంత్రి అయితే చంద్రబాబు పరిస్ధితేంటి ? ఈ ఆలోచనే చంద్రబాబులో టెన్షన్ పెంచేస్తోంది. అసలే ఓటుకునోటు కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. లక్ష్మీపార్వతి వేసిన కేసు విచారణలో ఉంది. ఈ పరిస్ధితుల్లో మరికొన్ని కేసులు కూడా చంద్రబాబుకు చుట్టుకుంటే అంతే సంగతులు.