వైసీపీకి షాక్ ఇచ్చిన కాపులు… కాపులకు షాకిస్తున్న తమ్ముళ్లు!

ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించి.. అతి త్వరలో అక్కడ నుంచి పరిపాలించాలనుకుంటున్న జగన్ కు ఉత్తరాంధ్రలోనే గట్టి దెబ్బతగిలిన పరిస్థితి. జగన్ సీమ సింహం అని చెప్పుకునే వైకాప నేతలకు.. రాయలసీమలోనూ వ్యతిరేక పవనాలే వీసిన పరిస్థితి. అయితే… ఇదంతా కాపుల క్రెడిట్టే అంటున్నారు జనసైనికులు!

లాస్ట్ టైం పవన్ విశాఖ వచ్చినప్పుడు జగన్ సర్కార్ చేసిన పనులకు, పెట్టిన ఇబ్బందులకు కాపులు కక్ష తీర్చుకున్నారని చెప్పుకుంటున్నారు జనసైనికులు. ఇదే క్రమంలో ఉత్తరాంధ్రలో బీసీలతోపాటు కాపు సామాజికవర్గ జనాభా కూడా అత్యధికంగానే ఉంటుంది. ఇవన్నీ కలిపి రాజధాని సంగతి తర్వాత… ముందు పవన్ కి జరిగిన అవమానానికి రివేంజ్ తీర్చుకోవాలని ఫిక్సయ్యారట. ఆ రివేంజ్ ఎఫెక్టే ఈ ఫలితాలు అనేది వారి వాదన!

సో… ఇప్పుడైనా చంద్రబాబుకు పవన్ రేంజ్ తెలిసి ఉంటుంది. సో ఈసారి పొత్తులో భాగంగా అడిగినన్ని సీట్లు, అడిగిన చోట ఇవ్వాలని ఆన్ లైన్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో కౌంటర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు టీడీపీ కార్యకర్తలు. ఈ విజయం టీడీపీ సోలో క్రెడిట్ అని అంటున్నారు తముళ్లు. జనసేన బీజేపీకి మద్దతు అని చెప్పలేదు – అలానే టీడీపీకి కూడా తమ మద్దతు అని చెప్పలేదు కదా… పైగా, జనసేన మద్దతు తమకే అని బీజేపీ నేతలు చెప్పుకున్నారుగా. అంటే… బీజేపీకి వచ్చిన ఓట్లు.. బీజేపీ + జనసేనవన్నమాట. అని కౌంటర్స్ వేస్తున్నారు!! ఏరు దాటాక తెప్ప తేలేయడం అంటే ఇదే… జనసేన రీకౌంటర్!

మరి ఆన్ లైన్ వేదికగా మొదలైన ఈ రచ్చ.. అధినేతలవరకూ చేరుతుందా.. వారి మధ్య కూడా ఇలాంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉందా.. సీట్ల వ్యవహారమే పొత్తులో కీలకం కాబట్టి… ఈ గెలుపిచ్చిన ఉత్సాహంతో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వంటి విషయాలు తెలియాలంటే.. వేచి చూడాలి!