ఓ రాజకీయ పార్టీ మీద ఇంకో రాజకీయ పార్టీ దాడి చేయడమంటే అది అత్యంత హేయమైన విషయం. వైసీపీ నేతలు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారోగానీ.. వైసీపీని సర్వనాశనం చెయ్యాలనే కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది వాళ్ళ మాటలు చూస్తోంటే.
రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. ట్రెండ్ మారింది గనుక, ఆ విమర్శల్లో తిట్లు కూడా సహజమైపోయాయి. కానీ, దాడుల సంస్కృతి ఏంటి.? జనసేన పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు, మంత్రుల మీద దాడి చేశారన్నది ఆరోపణ. ప్రభుత్వం తమ చేతుల్లోనే వుంది గనుక, దాడికి సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టాల్సిన బాధ్యత అధికార పార్టీ మీదనే వుంది.
ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదు. దురదృష్టం, దాడులు చేయకుండా రాజకీయాలు నడవడంలేదు. ముందు ముందు నేరుగా రోడ్ల మీద పడి చంపేసుకునే పరిస్థితి రాజకీయాల్లో నిత్యకృతమైపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.! తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపైకి వైసీపీ శ్రేణులు గతంలో దాడికి దిగడమే ఇందుకు కారణం. ఈ దాడుల సంస్కృతి విషయంలో టీడీపీ తక్కువేమీ తిన్లేదు.
రాజకీయాల్లో మార్పు.. అంటూ దూసుకొచ్చిన జనసేన కూడా విశాఖ విమానాశ్రయం దగ్గర మంత్రులపై దాడి ఘటనతో తాను కూడా ఆ ఫక్తు రాజకీయాల్లో భాగమేనని నిరూపించేసుకుంది.
అంతమాత్రాన, ‘ఆరు శాతం ఓటు బ్యాంకు వున్న జనసేన మీద 50 శాతం ఓటు బ్యాంకు వున్న వైసీపీ దాడి చేస్తే.?’ అంటూ దీర్ఘం లాగడం వైసీపీ నేతలకు తగునా.? టీడీపీ నుంచి వైసీపీలోకి దూకిన వల్లభనేని వంశీ లాగిన లాజిక్కు ఇది. రేప్పొద్దున్న ఈక్వేషన్ మారుతుంది.. వైసీపీకి ఓ ముప్ఫయ్ శాతం ఓటు బ్యాంకు వస్తుందనుకుందాం.. ఇంకేదన్నా పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు వస్తుందనుకుందాం.. అప్పుడూ వల్లభనేని వంశీ లాజిక్ ప్రయోగించొచ్చా.?
నాన్సెన్స్.. రాజకీయమంటేనే ఛండాలం అనేలా తయారైంది. రాజకీయ నాయకులే.. అందునా, ఏపీ రాజకీయ నాయకులే ఇలా తయారయ్యారు బాధ్యత లేకుండా.!