ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల.! అయితే, ఏంటి.?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం దాదాపు ఖాయమైపోయిందట. రేపో మాపో అధికారిక ప్రకటన రాబోతోందిట. తెలంగాణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థిగా వైఎస్ షర్మిల, ఈసారి రాజకీయాన్ని ఏపీలో చేయబోతున్నారట.!

ఏంటీ, నిజమేనా.? ‘నేను తెలంగాణ గడ్డ మీద పుట్టి వుండకపోవచ్చు. కానీ, తెలంగాణ నాకు మెట్టినిల్లు. నా రాజకీయ జీవితమంతా తెలంగాణలోనే. తెలంగాణ ప్రజల కోసమే ఈ మిగిలిన జీవితమంతా..’ అంటూ సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నినదించారు.

గతం గతః రాజకీయ నాయకులు మాట మీద నిలబడరు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించిన వైఎస్ షర్మిల, ఆ తర్వాత తెలంగాణకు షిఫ్ట్ అయిపోయారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైటీపీ జెండా దించేశారు, కాంగ్రెస్ పార్టీతో సర్దుకుపోయారు. రేపే మాపో కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనమన్న ప్రచారం జరిగిందిగానీ, విలీనం జరగలేదు. అలాగని, వైటీపీ జెండా కూడా ఎగరడంలేదు. దించిన జెండా అలాగే మురిగిపోతోంది.

నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ వైఎస్ షర్మిల పెద్దగా చేసేదేమీ వుండదు. కాకపోతే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది గనుక, అది కొంత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశం వుండొచ్చు. ఓట్ల పరంగా మాత్రమే.! సీట్ల గురించి కాంగ్రెస్ ఆశించే ఛాన్సే లేదు.

వైఎస్ షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తారా.? అదీ అన్న జగన్ మీద పులివెందులలో.? లేదా కడప ఎంపీ అభ్యర్థిగా.? ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.!