శ్రీకాకుళం జిల్లా పర్యటనలో చంద్రబాబునాయుడు చాలా అబద్దాలే చెప్పారు. జలసిరికి హారతిలో భాగంగా జిల్లాలోని నాగావళి నది వద్ద జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, తాను ఎప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. ఎనిమిదేళ్ళ నాటి కేసును తిరగదోడి ఇపుడు అరెస్టు వారెంట్ జారీ చేయటంపై మండిపడ్డారు. తాను తగ్గి అడిగినా ప్రధానమంత్రి నరేంద్రమోడి కనికరం చూపలేదని చంద్రబాబు చెప్పుకోవటం విడ్డూరంగా ఉంది.
ఇక్కడ విషయం ఏమిటంటే, ఎనిమిదేళ్ళ నాటి కేసును తిరగదోడి తనకు అరెస్టు వారెంటు పంపారని చంద్రబాబు చెప్పుకోవటం అంతా అబద్దం. ఎందుకంటే, కేసును తిరగదోడి అరెస్టు వారెంటు పంపలేదు. నోటీసులు ఇచ్చినా కేసు విచారణకు హాజరుకానందుకే కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని మాటిమాటికి చెప్పుకునే చంద్రబాబుకు కోర్టు నోటీసులను పట్టించుకోకపోతే అరెస్టు వారెంటు జారీ అవుతుందన్న చిన్న విషయం తెలీదా ? విచారణకు హాజరుకావాలంటూ కోర్టు నోటీసులిచ్చినా ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు గైర్హాజరైనట్లు అనుమానం వస్తోంది. ప్లాన్ ప్రకారమే అరెస్టు వారెంటుపై చంద్రబాబు ఇపుడు అంత సీన్ క్రియేట్ చేస్తున్నట్లు స్పష్టమైంది.
ఇక, కేసులకు భయపడేది లేదని చెప్పుకోవటం కూడా శుద్ద అబద్ధమే. ఎలాగంటే, తనపై కోర్టుల్లో ఉన్న 16 కేసులపై విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకుని కంటిన్యు అవుతున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆ 16 కేసుల గురించి ఎంతమందికి తెలుసో లేదో తెలీదు కానీ లేటెస్ట్ ఓటుకునోటు కేసు మాత్రం అందరికీ తెలుసు. ఆ కేసులో ఇరుక్కుని అరెస్టుకు భయపడే చంద్రబాబు అర్ధాంతరంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలేసి విజయవాడకు పరిగెత్తుకెళ్ళిపోయారు. ఓటుకునోటు కేసులో తనపై విచారణ జరగకుండా హైకోర్టులో స్టే తెచ్చుకున్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ కేసు విచారణ గనుక జరిగితే తలెత్తబోయే పరిణామాలు ఎలాగుంటుందో మిగిలిన వాళ్ళకన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. అటువంటిది తాను కేసులకు భయపడనంటు చెప్పుకుంటే నమ్మే వెర్రి వెంగళప్పలెవరు లేరు.
తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపిల మధ్య పొత్తు కుదరటం అన్నది చారిత్రక ఘట్టం. అంత కీలక పరిణామం గురించి చంద్రబాబు బహిరంగంగా ఎందుకు రెత్తటం లేదు ? మీడిమా సమావేశంలో కూడా చంద్రబాబు ఎందుకు పాల్గొనలేదు ? సీట్ల సర్దుబాటు గురించి కూడా మీడియాలో ప్రకటించే ధైర్యం చంద్రబాబుకు లేదు. అంతెందుకు ముందస్తు ఎన్నికల్లో ప్రచారానికి కూడా దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నట్లు ? ఎన్నికల సందర్భంగా తెలంగాణాలో అడుగుపెడితే కెసిఆర్ గురించి మాట్లాడాలి. మాట్లాడితే ఓటుకునోటు కేసులో కదలిక వస్తుంది. కేసు విచారణ మొదలైతే అరెస్టు దాకా వెళుతుందేమో అన్న భయమే చంద్రబాబును దూరంగా ఉంచుతోందన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. అటువంటిది కేసులకు భయపడనని అబద్ధాలు చెప్పుకుంటే సరిపోతుందా ?
(కోపల్లె ఫణికుమార్)