ఏపీలో బీజేపీ-టీడీపీ కలిస్తే వచ్చే ఫలితాలివే?

ఏపీలో ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని సీఎం జగన్ చెప్పినా… ఇప్పటికే ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిపోయింది! ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలూ ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టేశాయి. ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు మొదలైపోయాయి. ఇదే సమయంలో జనసేన కూడా వారాహి యాత్ర మొదలుపెట్టేసింది. ఈ సమయంలో బీజేపీ, టీడీపీ కలిస్తే ఏపీలో ఫ్యూచర్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

తాజాగా నేషనల్ మీడియాలో సైతం “ఏపీలో నమో” చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. మాములుగా నమో అంటే నరేంద్ర మోడీ అంటారు.. కాని, ఏపీ విషయానికొస్తే నాయుడు మోడీ ధ్వయం అనే చర్చ తెరపైకి వచ్చింది. అలా జరిగిన కూడా లోక్ సభ విషయంలో ఏపీలో 2019 ఎన్నికల ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

అవును… 2019 ఎన్నికల ఫలితాల విషయానికొస్తే 22 లోక్ సభ స్థానాలను వైసీపీ గెలుచుకోగా, ముగ్గురు టీడీపీ నేతలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు బీజేపీ + టీడీపీ కలిస్తే అది 4 ఎంపీస్థానాలు గెలుపొందొచ్చనే చర్చ నడుస్తుంది. తాజా సర్వే ఫలితాలు, అనాలసిస్ ల వివరాలను బట్టి చూస్తే… ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తుతో పోటీ చేసినప్పటికీ వైసీపీకి 21 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అలా కాకుండా ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి 3 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఫలితంగా కూటమికి గతంతో పోలిస్తే ఒక్క సీటు పెరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు వైసీపీ 22 స్థానాలను పదిలంగా ఉంచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

ఈ సమయంలో ఏపీలో బీజేపీ సైతం టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో ఒక అడుగు ముందుకేసిందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక చంద్రబాబు ఎలాగూ అదే కోరుకుంటున్న పరిస్థితి. కాకపోతే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో.. ఆ దిశగా సమాయత్తమవుతున్నట్లు ఇంకా ప్రజలకు సంకేతాలు ఇవ్వడం లేదు.

అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి తేరుకోలేని షాక్ ఇవ్వడంతో బీజేపీకి దక్షిణాదిలో దారులు మూసుకుపోయాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి కూడా టీడీపీ అవసరం ఉందనేది తాజా వాదాన. ఏపీ బీజేపీలో చంద్రబాబుని తీవ్రంగా వ్యతిరేకించే వర్గం ఈ విషయాన్ని అంగీకరించడానికి సమ్మతంగా లేకపోయినా.. బీజేపీలోని బాబు శ్రేయోభిలాషులు మాత్రం ఈ పొత్తు కార్యరూపం దాల్చడానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారు!

అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఏపీలో టీడీపీ కి బీజేపీ అవసరం కంటే… బీజేపీకి ఏపీలో టీడీపీ అవసరం ఉందనేది తేటతెల్లమవుతుంది! మరి ఈ పొత్తుల పంచాయతీ ఎప్పుడు కొలిక్కి వస్తుంది.. వచ్చిన అనంతరం ఏపీలో లోక్ సభ సీట్ల విషయంలో ఏ మేరకు ప్రభావం చూపగలుగుతుంది అనేది వేచి చూడాలి!