అయ్యోపాపం ఎన్టీయార్.. అనిపిస్తోంది కదా.? ఎవరి ఆత్మ.? ఎవరి గౌరవం.! ఔను, తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీయార్.. అంటున్నారు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సరే, తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీయార్ అయితే.. పింగళి వెంకయ్య ఎవరు.? అన్న ప్రశ్న రావడం సహజమే. అది వేరే సంగతి.
తెలుగు జాతి ఆత్మగౌరవం సంగతి పక్కన పెడదాం. అసలు, స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం మాటేమిటి.? ఈ భూమ్మీద భౌతికంగా స్వర్గీయ ఎన్టీయార్ లేకపోయినా, తెలుగువారి గుండెల్లో ఓ గొప్ప నటుడిగా ఎప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ముఖ్యమంత్రిగా తెలుగు రాజకీయాలపై ఆయన వేసిన ముద్రని చెరిపేయడమూ అంత తేలిక కాదు. నిజానికి, తెలుగు ప్రజలెవరూ ఆయన్ని మర్చిపోరు. మరి.. ఆ మహనీయుడి గొప్పతనాన్ని మర్చిపోయిందెవరు.? ఇంకెవరు స్వయానా ఆయన కుటుంబ సభ్యులే.
కేవలం తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకునే క్రమంలో ఇద్దరు అల్లుళ్ళ మధ్య జరిగిన పోరులో, స్వర్గీయ ఎన్టీయార్.. రాజకీయంగా అనాధ అయ్యారు. మరి, ‘మా నాన్న ఎన్టీయార్..’ అని చెప్పుకునే ‘కొడుకుల’ మాటేమిటి.? ప్చ్.. ఆ కొడుకులు కూడా ఆ రోజు ఎన్టీయార్ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముందుకు రాలేకపోయారు.
చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదది. ఎన్టీయార్ ఆత్మగౌరవాన్ని ఏనాడో ఖూనీ చేసేశారు.! అలాంటి ఎన్టీయార్, తెలుగు జాతి ఆత్మగౌరవమెలా అవుతారబ్బా.