మద్యపానం అనేక అనర్ధాలకు కారణం.! దురదృష్టవశాత్తూ ప్రభుత్వాలకు ఈ మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది.! తాగుబోతులు తాము ‘ట్యాక్స్ పేయర్స్’ అని చెప్పుకునే స్థాయికి ‘మద్యపానం’ అనే వ్యవహారం దిగజారిపోయిందన్నది బహిరంగ రహస్యం.!
అప్పుడెప్పుడో స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో తెలుగునాట మద్య నిషేధం అమల్లోకి వస్తే, ఆ ఎన్టీయార్ అల్లుడు నారా చంద్రబాబునాయుడు హయాంలో మద్య నిషేధం ఎత్తివేయబడిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సంపూర్ణ మద్య నిషేధం’పై రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా, ‘మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం’ అని ప్రకటించారు. అంతే కాదు, ఆ మద్య నిషేధం అంశమే, నవరత్నాల్లో ఓ ‘రత్నం’గా పేర్కొనబడింది కూడా.!
కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, రాష్ట్రంలో మద్యం విక్రయాల్ని ప్రధాన ఆదాయవనరుగానే చూడాల్సి వస్తోంది. బెల్టు షాపుల్ని తొలగించామని వైసీపీ సర్కారు పదే పదే చెబుతున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతూనే వుంది. వాస్తవానికి మద్యం అనేది ఓ సామాజికాంశంగా మారిపోయిందన్నది నిష్టురసత్యం.
మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసు.. మద్యం కారణంగా ఆరోగ్యాలు పాడైపోతున్నాయనీ తెలుసు.. మద్యం కారణంగా ఆర్థికంగా చితికిపోతున్నామని కూడా మందుబాబులకు తెలుసు. కానీ, మద్యపానం అనేది ఓ మానుకోలేని దుర్వ్యసనం. అందుకే, దాన్ని అస్సలు మానుకోలేకపోతున్నారు.
మద్యం రేట్లను పెంచితే, మద్యపానం తగ్గుతుందని తొలుత వైసీపీ సర్కారు భావించింది. కానీ, ఆ ఆలోచన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో, పెంచిన ధరల్ని మళ్ళీ తగ్గించక తప్పలేదు. నిజానికి, కోవిడ్ సమయంలోనే, మద్య నిషేధానికి సంబంధించి వైసీపీ సర్కారుకి ఓ అద్భుత అవకాశం దొరికినా, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం బాధాకరం.
‘మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంటే, దాన్ని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది అధ్యక్షా..’ అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఖజానాకి మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎంత ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇంతకీ, సంపూర్ణ మద్య నిషేధం గురించి రాష్ట్రంలో సాధారణ ప్రజానీకం, అందునా మందుబాబులు ఏమనుకుంటున్నారు.? నవరత్నాల్లో ‘మద్య నిషేధం’ అనే రత్నం తాలూకు ఎఫెక్ట్, వైసీపీ ప్రభుత్వంపై రానున్న ఎన్నికల్లో ఎలా పడబోతోంది.? ఈ ప్రశ్నలకు లోతుగా సమాధానాలు వెతికితే, ఆసక్తికరమైన అంశాలే వెలుగు చూస్తున్నాయి.
సంపూర్ణ మద్య నిషేధం అనేది అసాధ్యమనే అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సంపూర్ణ మద్య నిషేధం అనే ప్రకటన చేస్తే, అది తప్పుడు హామీనే అవుతుందన్నది ప్రజల విశ్వాసం. గత అనుభవాల నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పష్టత ఇది. మందుబాబులైతే, రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తే, పొరుగు రాష్ట్రాలకు వెళతామని నిర్మొహమాటంగా చెబుతున్నారు. అంతే కాదు, ప్రభుత్వాన్ని కూల్చే శక్తి మందుబాబులుగా తమకు వుంటుందనీ కుండబద్దలుగొట్టేస్తుండడం గమనార్హం.
మద్య నిషేధంపై ప్రకటన చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలివి తక్కువతనానికి నిదర్శనమన్న అభిప్రాయం జనంలో వుంది. అదే సమయంలో, పెంచిన మద్యం ధరల వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని అంతటా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నిటికీ మించి, కొత్త కొత్త.. వింత వింత.. బ్రాండ్ల మద్యం, తమ ప్రాణాల్ని తీస్తోందని బాధిత కుటుంబాలు.. అంటే, మద్యపానం వల్ల తమ వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరు మున్నీరవుతూ చెబుతున్నాయి.
చంద్రబాబు హయాంలోనే అనుమతించిన బ్రాండ్లు కదా.? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన కొందరు, ఆ చంద్రబాబు హయాంలోనే ప్రజా వేదిక నిర్మిస్తే, దాన్ని వైఎస్ జగన్ కూల్చేశారు కదా.? అలాంటప్పుడు, కొత్త బ్రాండ్ల మద్యాన్ని ఎందుకు నిషేధించడంలేదు.? అని ప్రశ్నిస్తుండడం గమనించదగ్గ అంశం.
‘నువ్వు నొక్కని బటన్ సంపూర్ణ మద్య నిషేధం జగన్..’ అంటూ పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన విషయాన్ని, రాష్ట్రంలో చాలామంది ప్రజలు గుర్తు చేస్తుండడంపై వైసీపీ సర్కారు ఒకింత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది.
వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నమాట వాస్తవం. ప్రజల ఖాతాల్లోకి ఆయా సంక్షేమ పథకాల తాలూకు సొమ్ము నేరుగా వెళుతోంది. అలాగే, వాలంటీర్ వ్యవస్త కూడా కొన్ని పథకాల ద్వారా చేరాల్సిన సొమ్ముని, నేరుగా ప్రజలకు చేర్చుతున్నారు. ఈ మొత్తంలో చాలా వరకు, మద్యం వైపు.. అట్నుంచి ప్రభుత్వ ఖజానాకి చేరుతోందనే విమర్శ కూడా లేకపోలేదు.
ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడం అత్యంత దురదృష్టకరమన్న అభిప్రాయాలు ప్రజల్లోంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మీద అత్యంత వ్యతిరేకతకు కారణమవుతున్న ‘అమలుకాని నవరత్నం’ ఏదైనా వుందంటే అది ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ అనే రత్నమే.!
‘సంక్షేమ పథకాల పేరుతో సొమ్ములు ఇవ్వకపోయినా షర్లేదు.. ముందైతే మద్య నిషేధం అమలు చెయ్..’ అనే వాదన మద్యం బాధిత కుటుంబాల నుంచి వ్యక్తమవుతోందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొత్త బ్రాండ్ల మద్యంతో ప్రజారోగ్యం పతనమవుతున్నా, ఎన్నో చావులు చోటు చేసుకుంటున్నట్లు వార్తొలస్తున్నా, ప్రభుత్వమెందుకు తగు రీతిలో స్పందించలేకపోతోందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది.
అధికార పార్టీకి చెందిన నేతల జేబులు మద్యం అమ్మకాల వల్ల బాగా నిండుతుండడం వల్లే ప్రభుత్వం, మద్య నిషేధంపై సానుకూల నిర్ణయం తీసుకోలేకపోతోందన్న విమర్శ విపక్షాల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మద్యం స్కామ్.. అంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరునీ విపక్షాలు లాగాయి. ఇంతలా మద్యం కారణంగా వ్యక్తిగతంగా తనపైనా, తన కుటుంబంపైనా, తమ ప్రభుత్వంపైనా, పార్టీపైనా విమర్శలు వస్తున్నా, మద్య నిషేధాన్ని అమలు చేయడంలో సీఎం వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడానికి కారణమేంటి.?
మద్య నిషేధం వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని తాత్కాలికంగా కోల్పోవాల్సి రావొచ్చు. కానీ, ఆ మద్య నిషేధం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా వైద్య రంగంపై చేయాల్సిన ఖర్చు తగ్గుతుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. అఘాయిత్యాలు కూడా తగ్గుతాయి. వీటి ద్వారా పరోక్షంగా ప్రభుత్వ ఖజానాకి ఎంతో ఉపశమనం దక్కుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి, ప్రభుత్వం ఇప్పటికైనా మద్య నిషేధంపై సముచిత నిర్ణయం తీసుకుంటుందా.? తీసుకోవాలనే ఆశిద్దాం.