ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో పొలిటికల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంచలన విషయాలను ఎంచుకుని, మరింత సంచలనంగా తెరకెక్కించి, మరెన్నో సంచలనాలకు తెరలేపే దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజా చిత్రం “వ్యూహం” టీజర్ విడుదలయ్యింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఈ టీజర్ హడావిడి మొదలైపోయింది.
అవును… రామ్ గోపాల్ వర్మ “వ్యూహం” టీజర్ విడుదలైంది. టీజర్ మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సాగినా.. “అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాను” అంటూ చివర్లో జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్ ఒక్కటే వినపడింది. ఎమోషన్, సెంటిమెంట్, హీరోయిజం… ఇలా అన్ని విషయాల్లోనూ వర్మ జాగ్రత్తలు తీసుకున్నట్లు గా ఈ టీజర్ లో కనిపిస్తుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన దగ్గర్నుంచి ఈ సినిమా మొదలయ్యేలా కనిపిస్తోంది. వైఎస్సార్ వరకు అందుబాటులో ఉన్న ఆయన ఒరిజినల్ వీడియోలను వాడుకున్న ఆర్త్జీవీ… ఆ తర్వాత మిగతా పాత్రలకు వారికి సరిపోయే పాత్రధారుల్ని తీసుకున్నారు. జగన్, భారతి, విజయమ్మ, రోశయ్య, చంద్రబాబు.. తదితర పాత్రలన్నీ ఇందులో చాలా దగ్గర పోలీకలతో కనిపిస్తాయి.
ఇదే సమయంలో ఎన్టీఆర్ ఫొటో బ్యాక్ డ్రాప్ గా వాడుకుంటూ చంద్రబాబుతో ఉన్న ఇతర పాత్రలను కూడా పరిచయం చేశారు వర్మ. జగన్ దగ్గరకు అధిష్టానం దూతలు రావడం, సీబీఐ కేసులు, అరెస్ట్ లు, ఆ తర్వాత జగన్ రాజకీయ పోరాటం.. ఇలా సాగింది ఈ టీజర్.
కాగా… గతంలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రల్ని పేరడీ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఇప్పుడు జగన్ పాత్రను హైలెట్ చేస్తూ “వ్యూహం” అనే సినిమా అనౌన్స్ చేశారు వర్మ. అందులోనూ నేరుగా సీఎం జగన్ ని రెండుసార్లు కలవడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది.