అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు.. ఇలా రెండు వైపులా ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది సక్రమంగా జరిగితేనే, రాజకీయాల్లో ‘పొత్తుల’ వల్ల లాభం.! లేని పక్షంలో, రాజకీయ పార్టీల కలయిక వృధా ప్రయాసగా మారిపోతుంది.
2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు కుదిరింది. చిత్రరంగా జనసేన – బీజేపీ ప్రస్తుతం స్నేహంలోనే వున్నాయి. అయితే, ‘జనసేన – టీడీపీ’ ప్రభుత్వం అని మాత్రమే జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఎక్కడా, ‘జనసేన – బీజేపీ’ ప్రభుత్వం అనిగానీ, జనసే – బీజేపీ – టీడీపీ ప్రభుత్వం అనిగానీ అనడంలేదు పవన్ కళ్యాణ్.
టీడీపీ – జనసేన పొత్తు విషయమై అధికార వైసీపీ కొంత ఆందోళనలో వున్న మాట వాస్తవం. టీడీపీ – జనసేన మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది సరిగ్గా జరిగితే, వైసీపీ ముమ్మాటికీ ఓడిపోతుంది. అలా ఆ రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ సజావుగా సాగకూడదని, అసలు ఆ పొత్తు నిలబడకూడదనీ వైసీపీ బలంగా కోరుకుంటోంది.
ఇక, టీడీపీ – జనసేన ఏమనుకుంటున్నాయి ఓటు ట్రాన్స్‌ఫర్ విషయంలో.? ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెళ్ళినప్పుడే, ఈ ఓటు ట్రాన్స్‌ఫర్ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కింది స్థాయిలో జనసేన మద్దతుదారులు టీడీపీకి వ్యతిరేకంగా నినదిస్తుండడాన్ని పవన్ కళ్యాణ్ వద్ద చంద్రబాబు ప్రస్తావించారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. దానికి పవన్ కళ్యాణ్ నుంచి కూడా గట్టి సమాధానమే వచ్చిందట. ‘మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ అనుకూల మీడియా మాకు వ్యతిరేకంగా నినదిస్తోంది కదా..’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పేసరికి, చంద్రబాబు దగ్గర సమాధానం లేకుండా పోయిందట.
నిజానికి టీడీపీ – జనసేన మధ్య పొత్తు వల్ల రెండు పార్టీలకూ వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం చేకూరకపోతే, దానికి బాధ్యత అంతా టీడీపీ అనుకూల మీడియాదే అవుతుంది.