ప్రాణాలకి తెగించి వృద్ధులు, చిన్నారులని కాపాడిన వాలంటీర్!

గుంటూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ సాహసం ఆరుగురి ప్రాణాలు కాపాడింది. ప్రాణాలకు తెగించి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడేశాడు.. అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. రొంపిచర్లలో పేదలు నివసించే ప్రాంతంలో మొత్తం 12 పూరి గుడిసెలు ఉన్నాయి. శనివారం ఉన్నట్టుండి ఓ విద్యుత్‌ స్తంభం నుంచి తీగ తెగి పూరి గుడిసెపై పడింది.. వెంటే ఓ గుడిసెకు మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో రెండు పూరి గుడిసెలకు వ్యాపించాయి.

ఆ సమయంలో రెండు గుడిసెల్లో ఉన్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. అక్కడే వాలంటీర్‌‌గా ఉన్న బొజ్జా శివకృష్ణ ప్రమాదాన్ని గమనించాడు. వెంటనే గుడిసెల వైపు పరుగు పెట్టాడు. ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారులను బయటికి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. మరో గుడిసెకు తాళం వేసి ఉండగా లోపల గ్యాస్ సిలిండర్ ఉంది.. వెంటనే ఆ తాళం పగులగొట్టి సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చాడు. ఒకవేళ సిలిండర్ అక్కడే ఉంటే పక్కనే ఉన్న ఏడెనిమిది గుడిసెలకు మంటలు వ్యాపించి ప్రాణనష్టం జరిగి ఉండేది.

శివకృష్ణ వృద్ధులు, నలుగుర్ని కాపాడే క్రమంలో ఒంటికి మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించారు.. వాలంటీర్‌ శివకృష్ణను అభినందించారు. అతడి వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు.