ఏ ఉద్దేశ్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారోగానీ, ఆ వ్యాఖ్యల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై గట్టిగానే కనిపిస్తోంది. వాలంటీర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం చూశాం. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల్నీ తగలబెట్టారు వాలంటీర్లు.
వాలంటీర్లంటే, మెజార్టీ వైసీపీ కార్యకర్తలే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. దాంతో, వైసీపీకి పని తేలికైంది. జనసేన అధినేత మీద మహిళా లోకం మొత్తం తీవ్ర ఆగ్రహంతో వుందన్న భావన క్రియేట్ చేయడంలో వైసీపీ మేగ్జిమమ్ ప్రయత్నించింది.. కొంతమేర విజయం సాధించిందనే చెప్పొచ్చేమో.
అయితే, వాలంటీర్ల విషయమై పవన్ కళ్యాణ్ రెండో రోజుకే మాట మార్చారు. ‘వాలంటీర్లందర్నీ నేను ఏమీ అనలేదు. నేను విమర్శించింది వైసీపీ నేతల్ని. వాలంటీర్ వ్యవస్థని వాడుకుని వైసీపీ నాయకులు హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నారు..’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.
పవన్ కళ్యాణ్ మీద రాజకీయ రగడ ఓ వైపు, మంచో.. చెడో.. వచ్చిన పబ్లిసిటీ ఇంకో వైపు. రాష్ట్రంలో అధికార పక్షం వైసీపీ.. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. జనసేన సంగతేంటి.? ఇప్పుడైతే జనసేన పార్టీ రాత్రికి రాత్రి ప్రతిపక్షం అనే స్థాయికి ఎదిగింది.. ఈ వివాదం కారణంగా.
ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ దాదాపుగా సైలెంటయిపోయింది. నారా లోకేష్ పాదయాత్రను సైతం లైట్ తీసుకున్న టీడీపీ అనుకూల మీడియా, పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ కవరేజ్ ఇస్తోంది. ఈ కోణంలో చూస్తే, జనసేన ‘వాలంటీర్’ వివాదంతో పొలిటికల్ మైలేజ్ సాధించినట్టే.