పరిపూర్ణమైన అర్ధజ్ఞానంతో పవన్ మాట్లాడుతుంటారు.. లాజిక్ లేని వాదనలు తెరపైకి తెస్తుంటారు.. అవికాస్తా బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోతుంటారు.. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు.. నమ్ముకున్నోళలని నట్టేట ముంచేస్తాడు అని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. అందులో వాస్తవం ఉందని వైసీపీ నేతలు చెబుతుంటారు. ఈ సాయంలో తాజాగా పవన్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు నిరాధార ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో వేలాది మహిళలు, అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్‌కు గురవుతున్నారని ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమని పవన్ నిరాధార ఆరోపణలు చేశారు. పైగా ఈ సమాచారం తనకు కేంద్ర నిఘావర్గాల నుంచి వచ్చిందని… సెంట్రల్ ఇంటెలిజెన్స్ లోని ఒక అధికారి ఈ మేరకు తనకు సమాచారం ఇచ్చారని చెప్పుకొచ్చారు.
దీంతో ఆ వ్యవహారం గోలగోల అయిపోయింది. పవన్ విజ్ఞత మరిచి వ్యాఖ్యలు చేశారని, సంస్కారం విడిచి మాట్లాడారని రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, వాలంటీర్ల సహాయం పొందుతోన్న సామాన్య ప్రజలు.. పవన్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. పవన్ ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు!
అనంతరం పవన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పలు పోలీస్ స్టేషన్ లలో పవన్ పై కేసులు నమోదు చేశారు. పవన్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఆయన ఫోటోలు చెప్పులతో తొక్కారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పవన్ పై లీగల్ గా చర్యలు తీసుకునే విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. మరోపక్క మహిళా కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని పవన్ కు నోటీసులు పంపించింది.
ఈ సమయంలో పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్లపై స్పందించారు. వైజాగ్ లో ఒక మహిళను వాలంటీర్ హత్యచేశాడని పవన్ రెచ్చిపోయారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నచందంగా… ఎక్కడో పసుపు పత్రికల్లో ఒక వార్త వస్తే.. అది వాస్తవమా కాదా అనే విషయం తెలుసుకోకుండా అవాకులూ చెవాకులూ పేలేస్తుంటారు. ఫలితంగా పవన్ రాజకీయంగా అర్ధజ్ఞాని అని కొంతమంది అంటే… కాదు కాదు అజ్ఞాని అని ఇంకొంతమంది అంటున్నారు.
వైజాగ్‌లో ఒక మహిళను వాలంటీర్ హత్యచేశాడని పవన్ రెచ్చిపోయారు. ఈ ఘటనను చూపించి వెంటనే వాలంటీర్ వ్యవస్ధను రద్దు చేయాలంటూ గోల చేస్తున్నారు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు తప్పుచేస్తే ఏకంగా వ్యవస్థనే రద్దు చేయాలని పవన్ డిమాండ్ చేయటం ఏమిటో ఆయనకే తెలియాలి. వాస్తవానికి వైజాగ్ లో మహిళను హత్యచేసిన యువకుడిని విధులకు సరిగా రావటంలేదన్న కారణంతో వాలంటీర్ గా అధికారులు వారం రోజుల క్రితమే తప్పించేశారు. ఆ తర్వాత వారం రోజులకు అతను దారుణానికి పాల్పడ్డాడు.
దీంతో… అసలు వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసేయ్యాలని వాదించడం మొదలుపెట్టారు పవన్ కల్యాణ్. దీంతో కొన్ని కీలక విషయాలను తెరపైకి తెస్తున్నారు పరిశీలకులు.
విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఒక మహిళకు డబ్బు ఎరచూసి జనసేన నేత మాదాల శ్రీరాములు లాడ్జికి తీసుకెళ్ళి హత్య చేశాడు. అలాగే హిందుపురంలో జనసేన నేత ఒక వ్యక్తిపై దాడి చేసి 16 తులాల బంగారాన్ని కాజేశాడు. జనసేనలో యాక్టివ్ గా తిరిగేవాళ్ళు కొందరు కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో జరిగిన అల్లర్లలో జనసేన నేతలు చాలామందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మరి వాలంటీర్లలో ఒకరో ఇద్దరో తప్పుచేస్తే ఏకంగా ఆ వ్యవస్థనే తప్పు బడుతూ, ఆ వ్యవస్తనే రద్దు చేయమని కోరుతున్న పవన్… తన పార్టీలో ఇంతమంది కార్యకర్తలు, నేతలు హత్యలు, దోపిడీలు వంటి కేసుల్లో నిందితులుగా ఉంటే… జనసేనను మూసేస్తారా? వాలంటీర్లకు అప్లై చేసే లాజిక్ కరెక్టే అయితే… అది జనసేనకు కూడా అప్లై అవ్వాలి కదా? ఈ లెక్కన జనసేనను మూసేసి.. అప్పుడు అది చూపించి.. వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేయమని అడిగితే సహేతుకంగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.
అంతవరకూ… పవన్ వినిపించే ఆరోపణలు, చేసే డిమాండులూ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని.. జనాల్లో పవన్ ని అవి మరింత పలుచన చేస్తున్నాయని అంటున్నారు.