ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రజలు, మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ తో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న జనాలు చేస్తున్న కామెంట్ ఇది… వైజాగ్ స్టీల్ ప్లాంటి విషయంలో కేంద్రం పిల్ల చేష్తలు చేస్తుందని.. ప్రజల జీవితాలతో ఆటలాడుతుందని! అవును… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో కేంద్రం మొన్నటివరకూ వ్యవహరించిన తీరు.. నిన్న కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు.. నేడు కేంద్రం నుంచి విడుదలయిన ఒక ప్రకటన చూసిన వారికెవరికైనా… కేంద్రం ఎంత చిల్లరగా ప్రవర్తిస్తుందనేది అర్ధమవుతుందని అంటున్నారు!
అవును… వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం. దానికి అనుగుణంగానే కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా… కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు… ఎంత వ్యతిరేకించినా మోడీ మాత్రం లేక్కచేయటం లేదు. ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడంలో తగ్గేదేలేదు అంటున్నారు. జనం ఎంత ఏడ్చి మొత్తుకున్నా తనకు పట్టదని ప్రాక్టికల్ గా చెబుతున్నారు. ఈ క్రమంలో… తాజాగా విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే… ప్రైవేటీకరణ ప్రక్రియ నుండి కేంద్రం వెనకడుగు వేసిందన్నట్లుగా చెప్పారు.
దీంతో.. ఏపీ జనాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు హ్యాపీ ఫీలయ్యారు. దేవుడికి దణ్ణం పెట్టుకున్నారు. మోడీ మనసు మార్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇక బీఆరెస్స్ నేతలైతే ఒక అడుగు ముందుకేసి… తమ వల్లే కేంద్రం వెనక్కు తగ్గిందని.. ఇది తమ సక్సెస్ అని చెప్పుకున్నారు. అయితే… ఇంతలోనే మంత్రి ఫగ్గన్ సింగ్ మరోసారి స్పందించారు. ప్రైవేటీకరణ పై నిర్ణయం తీసుకోవాల్సింది తానుకాదని.. కేంద్ర క్యాబినెట్ మాత్రమే అని చావు కబురు చల్లగా చెప్పారు. దీనికి కొనసాగింపుగా కేంద్రం తరపున తాజాగా ఒక ప్రకటన జారీఅయ్యింది. అదేమిటంటే… ప్రైవేటీకరణ ప్రక్రియ నుండి కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదని.. వైజాగ్ స్టీల్స్ ను కచ్చితంగా ప్రైవేటీకరణ చేసి తీరుతామని!
దీంతో ఫైరవుతున్నారు ఏపీ ప్రజలు! ఎందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు అంటూ బీజేపీ నేతలపైనా.. మోడీ పైనా విరుచుకుపడుతున్నారు. దీంతో… బీజేపీ నేతలకు నోటమాట రావటంలేదు. ఏమి మాట్లాడితే ఎలాంటి సమస్య వస్తుందో అన్న టెన్షన్ కమలనాదుల్లో పెరిగిపోతోంది. దీంతోపాటు కొంతమంది సీనియర్ బీజేపీ నేతలైతే తేలు కుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉన్నారు.
ఫలితంగా… అందరినీ ఊరించేటట్లుగా కేంద్రమంత్రి ఎందుకు ప్రకటన చేశారో.. ప్రకటించిన కొద్దిగంటల్లోనే మళ్లీ ఎందుకు వెనక్కు తీసుకున్నారో.. కనీసం వారికైనా తెలుసో తెలియదో అని, ప్రజల ఎమోషన్స్ అంటే మోడీ & కో లకు అంత చులకనభావం అని అంటున్నారు విశ్లేషకులు!