విశాఖ స్టీల్ ప్లాంట్.! తెలుగు రాష్ట్రాల్లో అందరూ వెర్రి వెంగళప్పలే.!

విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ యేతర పార్టీలన్నీ నినదించాయి. ‘విశాఖ స్టీలు ప్లాంటుని ప్రైవేటు పరం కానివ్వం..’ అని తొలుత బీజేపీ నేతలూ నినదించారు, ఆ తర్వాత మాట మార్చారు.

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గస్ సింగ్, ‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్ళే యోచన లేదు’ అని ప్రకటించడంతో, ‘మా దెబ్బకే కేంద్రం వెనక్కి తగ్గింది’ అని తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ సహా, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, వీటితోపాటుగా టీడీపీ, జనసేన కూడా హంగామా చేశాయ్.

కానీ, రోజు మారేసరికి సీన్ మారిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం తేల్చేసింది. మీడియాలో జరుగుతున్నదుష్ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. సమాచార లోపంతోనే, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ప్రకటన వక్రీకరించబడిందనీ వివరించింది.

పెట్టుబడుల ఉప సంహరణ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించడంతో, మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలూ వెర్రి వెంగళప్పలైపోయాయ్. అదే సమయంలో, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఫూల్స్ అయిపోయారు కేంద్రం చేతిలో.

ఒక్కటి మాత్రం నిజం.. పార్టీలకతీతంగా అంతా ఒక్కటై, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదిస్తే, కేంద్రం దిగొస్తుంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?