Vizag Railway Zone : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటవ్వాలి.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే సమయంలో ప్రత్యేక హోదాతోపాటు రైల్వే జోన్, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. ఇలా పలు హామీలు దక్కాయి. వెనుకడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి కేంద్ర సహకారం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయ్. పోలవరం ప్రాజెక్టు సంగతి సరే సరి. ఇందులో ఒక్కటన్నా వాస్తవ రూపం దాల్చిందా.?
మరి, ఎనిమిదేళ్ళ కాలంలో రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఏం చేసినట్టు.? బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (రాజ్యసభ) తాజాగా మాట్లాడుతూ, అతి త్వరలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటవుతుందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని మోడీ సర్కారు ఉద్ధరించేస్తోందనీ సెలవిచ్చారు.
రోడ్లేసేస్తే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లేనా.? ఇందులో కొంత వాస్తవం అయితే లేకపోలేదు. వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టి జాతీయ రహదారుల్ని నిర్మించి, వాటి మీద టోల్ గేట్లతో అడ్డంగా దండుకుంటోంది కేంద్రం. సో, రోడ్ల వల్ల అదనంగా వాహనదారులకిగానీ, రాష్ట్రాలకిగానీ, దేశానికిగానీ ఒనగూడిన ప్రయోజనం ఎంత.? అన్నది ఓ పెద్ద చర్చ.
ఇక, రైల్వే జోన్ విషయానికొస్తే.. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది పరిస్థితి. రైల్వే జోన్ ఇవ్వడంలో కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటి.? అన్నదైతే ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కావడంలేదు. గతంలోనే రైల్వే జోన్ మీద ప్రకటన వచ్చింది. కానీ, అది కార్యరూపం దాల్చడంలేదంటే, ఉద్దేశ్యపూర్వక అలసత్వం ఇందులో వుందనే అనుమానం కలగకమానదు.
రాష్ట్రంలో బీజేపీకి అధికారం దక్కే పరిస్థితి వుంటే తప్ప, రాష్ట్రంపై బీజేపీ సాధారణ ప్రేమ కూడా చూపించే అవకాశం లేదు. దీన్నే కాషాయ కాఠిన్యంగా అభివర్ణించొచ్చేమో.!