ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ – బీజేపీల గురించిన చర్చ తెరపైకి వచ్చింది. నిన్నమొన్నటివరకూ టీడీపీ – జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు, సీఎం పోస్టు పంపకాల గురించిన చర్చ జరుగుతుండేది! అయితే… ఇప్పుడు ఉన్నపలంగా చర్చ మొత్తం బీజేపీ – టీడీపీల పొత్తువైపు మళ్లింది. బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది.. టీడీపీ ఎన్ని ఇవ్వాలనుకుంటుంది.. మధ్యలో ఏ నెంబర్ వద్ద ఈ లెక్క ఆగే అవకాశం ఉంది.. మొదలైన చర్చలు తెరపైకివస్తున్నాయి.
ఈ క్రమంలో రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. పైగా 2014 కి ఇప్పటికీ తమకు బలం పెరిగిందని చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు… వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా 25 అసెంబ్లీ 8 లోక్ సభ స్థానాలు అడుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. సరే వారు ఎన్ని అడిగినా.. వీరు ఎన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. ప్రధానంగా కొన్ని కీలక స్థానాలను బీజేపీ నేతలు అడుగుతున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా విశాఖ లోక్ సభ టిక్కెట్ కూడా బీజేపీ ఆశిస్తుందని చెబుతున్నారు. అయితే… ఇప్పుడు విశాఖ లోక్ సభ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ పోటీచేస్తారని కథనాలొస్తున్నాయి. పైగా గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారని.. టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. అయితే… ఈ సమయంలో టీడీపీ – బీజేపీ పొత్తు ఓకే అయితే… భరత్ త్యాగం చేయడం తప్పదని అంటున్నారు విశ్లేషకులు.
తాజాగా బీజేపీ నేతల నుంచి కూడా ఇలాంటి రియాక్షన్లే వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బీజేపీ నేత, చంద్రబాబుకు స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా పేరుందని చెప్పే సీఎం రమేష్ కు బీజేపీ నుంచి విశాఖ లోక్ సభ సీటు దక్కవచ్చని అంటున్నారు. తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాలపై స్పందించిన ఆయన… పొత్తులో భాగంగా త్యాగాలు తప్పవని వ్యాఖ్యానించడం గమనార్హం.
వాస్తవానికి త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఏపీ నుంచి సీఎం రమేష్ ను బరిలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే… పేరు ఏదైనా, ఫలితం సేం అని కామెంట్లు వినిపిస్తున్న వేళ… ఆ ఎన్నికల్లో దెబ్బ పడితే, కచ్చితంగా సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం అడుగుతున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే… బాలయ్య చిన్న అల్లుడికి చంద్రబాబు శ్రేయోభిలాషి నుంచి షాక్ తప్పకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.