2023లో పరిపాలనా రాజధాని కానున్న విశాఖ: మంత్రి రోజా.!

విశాఖపట్నం నగరాన్ని పరిపాలనా రాజధాని చేసే క్రమంలో వెనకడుగు వేసేదే లేదంటున్నారు మంత్రి ఆర్కే రోజా. 2023లో విశాఖ కేంద్రంగా పరిపాలన సాగుతుందని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ తదితరులు గత కొంతకాలంగా కుండబద్దలుగొట్టి మరీ చెబుతున్న సంగతి తెలిసిందే.

అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని అంటోంది. తాజాగా పార్లమెంటులోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసేసింది. వైసీపీ ప్రభుత్వం కొన్నాళ్ళ క్రితం అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టి, రాష్ట్రానికి మూడు రాజధానులని పేర్కొంది. కానీ, అదే బిల్లుని వైసీపీ సర్కారు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కోర్టు కేసులు, ఇతరత్రా వివాదాల కారణంగా.

ముందైతే రాష్ట్ర అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు ఇంకోసారి ప్రవేశపెట్టాలి. అలా పెట్టాలంటే, ప్రస్తుతం సుప్రీంకోర్టులో నలుగుతున్న కేసు ఓ కొలిక్కి రావాలి. అలా జరగకుండా చట్ట సభల్లో బిల్లు ప్రవేశ పెట్టడానికి లేదు. అలా బిల్లు ప్రవేశ పెట్టనప్పుడు, మూడు రాజధానుల ప్రస్తావనా రాదు.

అన్నిటికీ మించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది విభజన చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచనతో ఏర్పాటయ్యింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారింది. దానికి అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతూ తెలిపింది.

లాజికల్‌గా చూస్తే చాలా సమస్యలున్నాయ్.. వికేంద్రీకరణకు సంబంధించి. మరెలా వచ్చే ఏడాది నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన.. అని మంత్రులు చెబుతున్నట్లు.?