రాజకీయాల్లో వ్యూహాలుంటాయి. ఆ వ్యూహాలకు తగ్గట్టే మాటలు మారుతుంటాయి. మాట తప్పను.. మడమ తిప్పను.. అని ఎవరైనా రాజకీయాల్లో చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. వైఎస్ జగన్ ఇందుకు మినహాయింపేమీ కాదు. విశాఖ రాజధాని అంటున్నారు వైఎస్ జగన్. మరి, కర్నూలు సంగతేంటి.? అని రాయలసీమ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే సీమ నేతల్లో కొంత అలజడి బయల్దేరింది. అయితే, బాహాటంగా వైసీపీ సీమ నేతలెవరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుని ప్రశ్నించే పరిస్థితి లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులనేది సాధ్యమయ్యే పని కాదు. ఆ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ తెలుసు. కానీ, అమరావతి రగడ నేపథ్యంలో మూడు రాజధానులు.. అని అనక తప్పలేదు. అమరావతి రచ్చ చల్లారిన దరిమిలా, విశాఖ రాజధాని నినాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారు.
ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ‘విశాఖే రాజధాని’ అని నినదిస్తున్నా, సీమ వైసీపీ నేతలు మౌనంగా వుండడం వెనుక బలమైన కారణమే వుంది. వచ్చే ఎన్నికల నాటికి విశాఖను రాజధానిగా చేస్తే, వైసీపీకి రాష్ట్రంలో అడ్వాంటేజ్ వుంటుందని ముఖ్యమంత్ర వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే, అదే వైసీపీకి శాపంగా మారుతుందన్న వాదనా లేకపోలేదు. ఆ మూడు జిల్లాల్లోనూ చాలావరకు విశాఖ రాజధాని వ్యవహారానికి పెద్దగా సానుకూలత లేదు. అలాంటప్పుడు, విశాఖ రాజధాని అనే వాదనతో రాష్ట్రమంతా ఎలా నెగ్గుకు రాగలం.? అన్నది ఓ సెక్షన్ వైసీపీ నేతల అంతర్మధనం.
ఎలా చూసినా, విశాఖ రాజధాని.. అనే వాదనతో వైసీపీ తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నట్లయ్యిందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.