విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీర్మానం చేసేసింది. అయితే, పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, న్యాయస్థానం ఈ విషయమై ‘స్టేటస్ కో’ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కాగా, ఈ విషయమై తాజాగా వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, విశాఖ విషయమై వైఎస్ జగన్ ప్రభుత్వానికి ‘పై స్థాయిలో’ భరోసా వుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ‘విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని విషయమై ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాం..’ అని విజయసాయిరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై విజయసాయిరెడ్డి తనదైన స్టయిల్లో స్పందించి, రాజకీయాల్లో కాక రేపారు.
ఇంతకీ, ఆ పెద్దాయన ఎవరు.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, రాజధానిగా విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతం. హైద్రాబాద్ తరహాలో కాస్మొపాలిటన్ కల్చర్ వున్న నగరమది. జాతీయ స్థాయి సంస్థలు అక్కడున్నాయి. షిప్‌యార్డ్, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా చెప్పుకుంటూ పోతే, విశాఖకు లేనిది ఏంటి.? అని వెతుక్కోవాలి. అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారయ్యింది ఇప్పటిదాకా పరిస్థితి. ఇక, వైఎస్ జగన్ సర్కార్ విశాఖకు రాజధాని హోదా ఇస్తే, దానిపై పెను దుమారమే చెలరేగుతోంది. అమరావతిపై చర్చ వేరే. కానీ, ఆ అమరావతిని ఎంపిక చేసేముందు విశాఖకు జరిగిన అన్యాయం మాటేమిటి.? ఈ కారణంగానే, ఢిల్లీ స్థాయిలో ‘పెద్ద భరోసా’ వైఎస్ జగన్ సర్కార్‌కి లభించినట్లు చెబుతోంది. అదే విజయసాయిరెడ్డి నోట ‘ఎవరికి చెప్పాలో వారికే చెప్పాం’ అనే మాట రావడానికి కారణంగా కనిపిస్తోంది.
బీజేపీ ఉద్యమం పరిస్థితేంటో.!
‘జై అమరావతి’ అన్నందుకు, కన్నా లక్ష్మినారాయణ పదవి పోయింది బీజేపీలో. ‘అబ్బే, ఆయన్ని తొలగించలేదు.. ఇంకొకాయన్ని ఆ పదవిలో కూర్చోబెట్టాం..’ అంటూ బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కినా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి, పదవి ఊడగొట్టుకున్నాక.. ఆయన మళ్ళీ రాజకీయ తెరపై సరిగ్గా కన్పించలేదు. మరి, సోము వీర్రాజు పరిస్థితేంటి.? ప్రస్తుతానికైతే సోము వీర్రాజు హవా బీజేపీలో బాగానే కొనసాగుతోంది. కానీ, అమరావతి దెబ్బకు ఆయనా విలవిల్లాడాల్సి రావొచ్చు. ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్ర నాయకత్వం సరిగ్గా పట్టించుకోవడంలేదు. అంటే, దానర్థం.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర నాయకత్వం లేనట్టేగా.!