వలసలను ప్రోత్సహించేది లేదు అంటూనే వైసీపీ అనధికారిక చేరికలు తెరలేపిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు తన పార్టీ నుండి 23మంది ఎమ్మెల్యేలను కొనేస్తే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పటికిప్పుడు నేను గేట్లు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవ్వరూ మిగలరు. ఇవి వలసలు గురించి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. పైగా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని షరతు కూడ పెట్టారు. దీన్ని చూసి జగన్ రాజకీయ సూత్రాలను మార్చేస్తున్నారని హర్షించారు చాలామంది. కానీ వలసల రూట్ మాత్రమే మార్చారు ఆయన. పార్టీలో చేరక్కర్లేదు కానీ బయట నుండి మద్దతివ్వండి. నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలుగానే చెలామణీ అవ్వండి అన్నట్టు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు నీడనిచ్చారు. పైగా కొందరిని టార్గెట్ చేసి పెట్టుకున్నారు. వారి మీద గట్టిగానే వలలు వేశారు.
అలా వైసీపీ వల వేసిన ఎమ్మెల్యేల్లో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కూడ ఒకరు. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుండి గెలుపొందిన గణబాబు అలియాస్ పిజివిఆర్ నాయుడుకు సౌమ్యుడనే మంచి పేరుంది. గతంలో వైసీపీ నేతలు, వారి అనుకూల మీడియా గణబాబు కబ్జా కాండలకు పాల్పడుతున్నారని, అక్రమంగా వ్యహరిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడ గణబాబు విజయం సాధించారంటే ఆయన ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నుండి అనేక మంది నేతలను ఏదో ఒక వివాదంలో ఇరుకునపెట్టగలిగిన అధికార పార్టీ గణబాబును మాత్రం టచ్ చేయలేకపోయింది. అందుకే ఆయన్ను పార్టీ నుండి బయటికి లాగాలని నిర్ణయించుకుని స్థానిక నాయకుల ద్వారా, జిల్లా పెద్దల ద్వారా మంతనాలు నడిపారు.
ఒకానొక దశలో గణబాబు అసెంబ్లీ సాక్షిగా జగన్ పాలనను కీర్తించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం చూపిన చొరవ, సత్వర స్పందన బాగున్నాయని కీర్తించారు. అక్కడితో గణబాబు వైసీపీలోకి జంప్ అవుతారని తెలుగు తమ్ముళ్లు అనుమానపడ్డారు. కానీ ఇంతలోనే చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఏం చెప్పి ఒప్పించారో బయటకు రాలేదు కానీ గణబాబు మనసును మార్చగలిగారు. ఆయన్ను పార్టీ నుండి బయటికి పోకుండా ఆపడం మాత్రమే కాదు ఏకంగా జగన్ మీదకే తిరగబడేలా చేశారు. ఈమధ్య గణబాబు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడాం స్టార్ట్ చేశారు. పన్నుల భారం పెంచుతూ విశాఖ ప్రజలకు జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని, కరోనా కట్టడిలో విఫలమై వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని, ఆస్తి పన్నుపెంపు బిల్లును వెనక్కు తీసుకోకపోతే పోరాటం చేస్తామని అన్నారు.
నియోజకవర్గంలోనే కాదు విశాఖ మొత్తంలోని తెలుగు దేశం శ్రేణులను ఒక్క తాటి మీదకు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తున్నారట. ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారట. వెళ్ళిపోతాడనుకున్న ఎమ్మెల్యే ఇలా అధికార పక్షం మీద విరుచుకు పడుతుండటంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. వైసీపీ మాత్రం టీడీపీని వీడి తమతో కలిసివస్తాడని అనుకుంటే ఇలా రివర్స్ అయ్యాడేంటని షాకవుతోంది.