Visakhapatnam: త్వరలో, అతి త్వరలో విశాఖపట్నం నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలన చేపట్టనున్నారట. పరిపాలనా వ్యవహారాల్ని విశాఖ నుంచే కొనసాగించే దిశగా వ్యూహాత్మకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరి, కోర్టు కేసుల మాటేమిటి.? అంటే, ‘మా నిర్ణయం న్యాయబద్ధమైనది.. మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేసేలా మూడు రాజధానులు అంటున్నాం..’ అన్నది వైసీపీ వాదన. ఆ వాదనే నిజమైతే, అమరావతిలో గడచిన మూడేళ్ళలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి.? అన్న ప్రశ్నకు వైసీపీ దగ్గర సమాధానం లేదు.
ఇదిలా వుంటే, ఎవరు ఏమనుకున్నాగానీ.. విశాఖ నుంచి పరిపాలన అనేది ప్రారంభించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అన్న విధంగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, రాజధానిపై జోరు పెంచారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు.
‘పేరుకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. పరిపాలనా రాజధానే అసలు సిసలు రాజధాని, మిగతా రెండు రాజధానులు అమరావతి, కర్నూలు నామమాత్రమే..’ అని సాక్షాత్తూ వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా వ్యాఖ్యానించడం పెను రాజకీయ దుమారానికి కారణమవుతోంది.. ఆ వ్యాఖ్యలు వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
రాజకీయాల్ని కాస్సేపు పక్కన పెడితే, రాజధాని అయ్యే అన్ని అర్హతలూ విశాఖపట్నం కి వున్నాయ్. అమరావతి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ, రైతులు ప్రభుత్వానికి భూముల్ని ఇవ్వడం.. ఈ క్రమంలో వారి త్యాగం.. వీటి నేపథ్యంలోనే అమరావతిపై కాస్తో కూస్తో సింపతీ చాలామందికి వుందన్నది కాదనలేని వాస్తవం. ఆ అంశాన్ని పక్కకి పెట్టి ఆలోచిస్తే, విశాఖ మాత్రమే ఏకైక రాజధానిగా వుండడం వల్ల రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.