తగ్గేదేలే బాబు… విశాఖలో జనసేన అభ్యర్థులు వీరే!

వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎలాగైనాసరే గద్దె దించాలనే పట్టుదలతో టీడీపీ – జనసేన ఏకమైన సంగతి తెలిసిందే! ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే పొత్తు వెనుక ఉన్న తన ప్రధాన లక్ష్యం అని పవన్ పలుమార్లు ప్రకటించారు! ఇదే సమయంలో బీజేపీ కూడా వీరితో జతకట్టబోతుందని కథనాలొస్తున్నాయి కానీ.. ఆ కూటమిపై ప్రస్తుతానికి స్పష్టత అస్పష్టంగా ఉంది. ఆ సంగతి అలా ఉంచితే… ఇప్పుడు సీట్ల సర్దుబాటు అంశం ఈ రెండు పార్టీల మధ్య రచ్చ రంబోలా చేసేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోటీ చేసే స్థానాలపైనా, అభ్యర్థులపైనా క్లారిటీ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ పై తీవ్ర ఒత్తిడి వస్తుందని అంటున్నారు. జనసేనలో అధినేతతో సహా ఎవరికీ ఇంకా సొంత నియోజకవర్గం ఫిక్స్ కాని నేపథ్యంలో… కార్యకర్తల్లో ఆ మాత్రం టెన్షన్ ఉండటం సహజం కూడా. దీంతో ఏమనుకున్నారో ఏమో కానీ… మరో నాలుగు సీట్లను కన్ ఫాం చేసేశారు పవన్ కల్యాణ్! ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది!

వాస్తవానికి పొత్తు అన్నతర్వాత రెండు పార్టీల అధినేతలూ నాలుగు గోడల మధ్య అన్ని విషయాలు మాట్లాడుకుని.. మీడియా ముఖంగా వివరాలు వెళ్లడిస్తుంటారు! అయితే… చంద్రబాబు రెండు సీట్లు ప్రక‌టించ‌డంతో వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. దీంతో బాబు వ్యవహారశైలిపై మండిపడిన ప‌వ‌న్‌.. తామూ రాజానగరం, రాజోలు నియోజవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.

ఇదే సమయంలో… రాజమండ్రి రూరల్‌ కూడా తమకే కావాలని జనసేన పట్టుబడుతోంది. ఆ సీటును కందుల దుర్గేష్‌ కు ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారం కూడా చినికి చినికి గాలివానగా మారుతుంది. ఇప్పటికే టీడీపీ నుంచి అక్కడ ఆరు సార్లు విజయం సాధించిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈ విషయాలపై స్పందించిన ఆయన… తనను కాదని దుర్గేష్‌ కు ఎలా ఇస్తారంటూ గుర్రుగా ఉన్నారు.

కట్ చేస్తే… ఇప్పుడు సీన్ విశాఖకు మారింది. ఇందులో భాగంగా… విశాఖపట్నంలో నాగబాబుతో కలిసి సమీక్షలు నిర్వహించిన పవన్‌ కల్యాణ్‌.. తాజాగా నాలుగు స్థానాలతోపాటు అక్కడ పోటీచేసే జనసేన అభ్యర్థులను కూడా ప్రకటించారు! ఇందులో భాగంగా… భీమిలి – వంశీకృష్ణ యాదవ్‌, పెందుర్తి – పంచకర్ల రమేష్‌ బాబు, గాజువాక – సుందరపు సతీష్‌ కుమార్‌, యలమంచిలి – సుందరపు విజయ్‌ కుమార్‌ ను ఇన్‌ చార్జ్‌ లుగా ప్రకటించారు.

ఈ నియోజకవర్గాల విషయానికొస్తే… భీమిలిలో 2014లో టీడీపీ నుంచి గంటాశ్రీనివాస రావు పోటీ చేసి గెలిచారు. 2019లో సబ్బం హరి పోటీచేశారు. ఈ క్రమంలో ఈసారి గంటా శ్రీనివాస్ మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పెందుర్తి విషయానికొస్తే ఇక్కడ సీనియర్ నేత బండారు సత్యనారాయణ టీడీపీ నుంచి పోటీకి రెడీగా ఉన్నారు. పెందుర్తి జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

ఇక గాజువాకలో పల్లా శ్రీనివాస రావు గతంలో పోటీ చేసి ఉండగా… పవన్ కల్యాణ్ కూడా ఇక్కడ నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థిపై 14,520 ఓట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈసారి గాజువాక తమకు కావాలని పవన్ & కో పట్టుబడుతున్నారని అంటున్నారు. ఇలా టీడీపీకి బలమైన విశాఖలో పవన్ నాలుగు సీట్లు ప్రకటించేశారు.

ఈ విధంగా… చంద్రబాబు ఓ వైపు, పవన్‌ కల్యాణ్‌ మరో వైపు ఏకపక్షంగా స్థానాలను ప్రకటించుకుంటూ వెళ్లే వ్యవహారం ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నప్పటికీ సీట్ల పంపకం పూర్తి కాలేదు.. మరోపక్క బీజేపీతో పొత్తు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల మధ్య నియోజకవర్గాలవారీగా తగాదాలు, వివాదాలు రాజుకుంటున్న పరిస్థితి నెలకొంది.