కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో వున్నారు. ఆయన తల్లి అనారోగ్యం బారిన పడ్డంతో, ఆమెకు ఆ ఆసుపత్రిలో వైద్య చికిత్స జరుగుతోంది. సీబీఐ చేస్తున్న హంగామా, వైసీపీ శ్రేణులు చేస్తున్న హడావిడి.. ఇదంతా ఓ యెత్తు, పరామర్శలు మరో యెత్తు.
వైఎస్ విజయమ్మ, అవినాష్ రెడ్డి తల్లిని ఆసుపత్రిలో పరామర్శించారు. మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి సోదరి విమలా రెడ్డి మాత్రం, అవినాశ్ రెడ్డి తల్లిని ఆసుపత్రిలో పరామర్శించాక మీడియాతో మాట్లాడారు. పలు యూ ట్యూబ్ ఛానళ్ళకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఇక్కడే వ్యవహారం తేడా కొట్టింది. సునీతా రెడ్డిపై విమలా రెడ్డి చేసిన విమర్శలతో వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయ్యింది. ‘మా కుటుంబంలో ఇలాంటి అలజడి ఎప్పుడూ లేదు’ అని చెబుతున్నారు విమలారెడ్డి. సునీతా రెడ్డి మీద ఆరోపణలు కూడా చేశారామె.
మీడియా ముందుకు విమలా రెడ్డి ఎందుకు వచ్చారు.? ఆమెను ఎవరు తీసుకొచ్చారు.? అన్న ప్రశ్నలు సహజంగానే కొత్త ఉత్కంఠకు తెరలేపుతాయి. ‘ఆమె నాకు అత్యంత సన్నిహితురాలు. ఆమె కోలుకోవాలని ప్రార్థనలు చేసేందుకే వచ్చాను’ అని విమలారెడ్డి చెబుతున్నా, ఆామె చేసిన రాజకీయ విమర్శలతో రాజకీయం వేడెక్కింది.
విమలారెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. విజయమ్మ పాటి హుందాతనం విమలారెడ్డి ప్రదర్శించలేకపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.