విజయవాడ కనకదుర్గమ్మ తల్లి చుట్టూ నిర్మాణం జరిగిన ప్లై ఓవర్ ఇప్పుడు రాష్ర్ట రాజకీయాల్లో హాట్ టాపిక్. నేనంటే? నేను కట్టానంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కొట్టుకుంటున్నాయి. క్రెడిట్ తమ పార్టీకే దక్కాలంటూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు చేస్తున్నారు. మీడియా సాక్షిగా రాజకీయ పార్టీలు..నేతలు బాహాబాహీకి దిగుతున్నాయి. టీడీపీ హయాంలోనే పూర్తయింద ని ఎంపీ కేశినేని నాని అన్నారు. దాన్ని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పూల మాల వేసి ఆవిష్కరిస్తుందని ఎద్దేవా చేసారు. ఈ వ్యాఖ్యల్ని వైసీపీ ఖండించింది. దీనిలో భాగంగా విజయవాడ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్నదేవినేని అవినాష్ రెడ్డి లైన్ లోకి వచ్చి కేశీనేనిపై కౌంటర్లు వేసారు.
ఏ పార్టీ కట్టిందో ప్రజలకు తెలుసు…ఇప్పుడు తగుదనమ్మా అంటూ వెనకేసుకు రావడం టీడీపీకే చెల్లిందంటూ మండిపడ్డారు. క్రెడిట్ కొట్టేయడంలో ఆ పార్టీ నేతల ఐడియాలే భిన్నంగా ఉంటాయని ఎద్దేవా చేసారు. టీడీపీ హయాంలో ప్లై ఓవర్ పనులకు ఎలా జరిగాయో! వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ఎలా జరిగాయో ! విజయవాడ ప్రజలు..దుర్గమ్మ భక్తులు చూస్తూనే ఉన్నారని ఆక్షేపించారు. తాజాగా బీజేపీ కూడా ప్లై ఓవర్ వెనుక అసలు కథ నడిపించింది మేమంటూ ముందుకొచ్చింది. ప్లై ఓవర్ పూర్తవ్వడం వెనుక కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ కృషి, చొరవ ఎంతో కీలకంగా పనిచేసిందన్నారు.
బెంజి సర్కిల్ ప్లై ఓవర్ కూడా ఆయన వల్లే పూర్తయిందన్నారు. రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల విలువైన రహదారుల ప్రాజెక్ట్ లను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. కానీ కొత్త ప్లైవర్ క్రెడిట్ ని దక్కించుకోవాలని ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు చేస్తోన్న ప్రయత్నాలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లై ఓవర్ విషయంలో తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్లై ఓవర్ కి పునాది రాయి పడిందన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇలా ఏపీలో రాజకీయ పార్టీలు…కేంద్రంలో ఉన్న పార్టీలో బెజవాడ కనక దుర్గమ్మ ప్లై ఓవర్ క్రెడిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రాష్ర్ట ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. మరి ఈ ప్లై ఓవర్ కి ఏ రాజకీయ పార్టీ అనుమతిచ్చింది? ప‌్లై ఓవర్ కి పునాది రాయి పడింది ఏ ప్రభుత్వంలో? ఎప్పుడు పూర్తయింది? దాని వెనుక జరిగిన రాజకీయ కుతంత్రాలు సంగతేంటి? అన్నది తేలాలంటే విజయవాడ దుర్గమ్మ కొండ దిగొచ్చి చెప్పాలేమో! మరి అమ్మ ఎప్పుడు కరుణిస్తుందో.