విజయసాయి రెడ్డి ఒకటంటే.. ఆయన రెండన్నాడు!

విజయసాయి రెడ్డి

తమలపాకుతో నువ్వొకటంటే…తలుపు చెక్కతో నే రెండంటా.. అన్న చందాన ఉంది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల నేతల మాటలు. రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి మార్కు దాటేసి ఆందోళన రేపుతోంటే.. వీరు మాత్రం ఇంకా రాజకీయ విమర్శలకే పరిమితమై ఒకరినొకరు తిట్టుకునే పనిలోనే ఉన్నారు.

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కరోనాపై యుద్ధం చేస్తోంటే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం ట్విట్టర్ లో మాటల యుద్ధం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, వ్యంగ్ర అస్త్రాలు విసురుకుంటూ వీళ్లేం నాయకులురా అనిపించుకుంటున్నారు.

ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్స్ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. అయితే తాజాగా విజయసాయి రెడ్డి మళ్లీ ఇంకో ట్వీట్ వార్ కు తెరతీసినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను కరోనా హాస్పిటల్‌కు ఇస్తే తెలంగాణ ప్రజల రుణం తీర్చుకున్నట్టవుతుందన్న అభ్యర్థనలు చంద్రబాబుకు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సమయంలో పెద్ద మనసు కనబర్చాలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానివల్ల పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మ కూడా శాంతిస్తుందని వ్యాఖ్యానించారు ఆయన

దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ఘాటుగానే స్పంధించారు.

హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న లోటస్ పాండ్ ఇంద్ర భవనం,బెంగుళూరు లో ఖాళీగా ఉన్న యలహంక రాజ ప్రసాదం కరోనా ఆసుపత్రికి ఇవ్వాలని,ఆధునిక వసతులు ఉన్న భవనాలు కావడంతో కరోనా రోగులకు మంచి వైద్యం అందించే అవకాశం ఏర్పడుతుంది అని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.(1/2)
.
@ysjagan గారు పెద్ద మనస్సు చేసుకొని ఆ భవనాలు ఇస్తే ప్రజా ధనం కొట్టేసి నరకానికి వెళ్లిన వైకాపా ఆత్మకి కొంత ఊరట వచ్చే అవకాశం ఉంటుంది
@VSReddy_MP గారు.(2/2)

అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా రాజకీయ నేతల వ్యాఖ్యలు చూసి చీధరించుకుంటున్నారు ప్రజలు. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతూ, జిల్లాలకు జిల్లాలు రెడ్ జోన్లుగా మారుతుంటే.. అవేమీ పట్టకుండా వారు ఇలాంటి వింత వ్యాఖ్యలు, టైం పాస్ పనులు చేయడం ఏంటో మరి!