డోసు పెంచిన విజయసాయిరెడ్డి.! స్థాయి దిగజారిపోతోంది.!

Vijaysai Reddy

ఒకటి కాదు రెండు కాదు.. పొలిటికల్ మిర్చి అంటున్నారు.. నాక్ ఔట్ పంచ్ అంటున్నారు.. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎడా పెడా ట్వీట్లేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒకదానికి మించి ఇంకోటి.. అన్నట్టు వైసీపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేలా ఈ ట్వీట్లున్నాయి.

నారా లోకేష్‌ని ఏకంగా బోకేష్ అనేశారు.. ఎలకేష్.. అని కూడా ఎద్దేవా చేసేశారు. ‘ఏం పీకావ్..’ అని పదే పదే చంద్రబాబు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించడంపైనా సెటైర్ వేశారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించే తీరుపై చాలా విమర్శలున్నాయి.

వైసీపీలో సాధారణ నాయకుడేమీ కాదాయన. రాజ్యసభ సభ్యుడు, విద్యాధికుడు కూడా. అలాంటి విజయసాయిరెడ్డి, తన స్థాయిని దిగజార్చేసుకుని ట్వీట్లేయడమేంటి.? నారా లోకేష్ తక్కువేమీ తిన్లేదు.. ‘జగ్గడు’ అంటూ ముఖ్యమంత్రిని తూలనాడారు. అలాగని విజయసాయిరెడ్డి కూడా ఆ రొంపిలోకి దిగుతారా.? అన్నదే ఇక్కడ ప్రశ్న.

అధికార పక్షంలో వున్నవాళ్ళు సంయమనం పాటించాల్సిందే. కానీ, ఆ సంయమనానికి అర్థమేంటో మర్చిపోయారు వైసీపీ నేతలు. తద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో పలచనైపోతోంది. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది.

నిజానికి, వైసీపీలో విజయసాయిరెడ్డి కంటే ఘాటుగా టీడీపీ మీద విమర్శలు చేసే నేతలున్నారు. కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి కాస్తా మాజీ మంత్రి అయిపోయారు. తిట్లతో రాజకీయంగా ఎదుగుతామని ఎవరైనా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.