వైసీపీలో ఒకప్పుడు వైఎస్ జగన్ తర్వాత విజయసాయిరెడ్డి పేరే ప్రముఖంగా వినిపించేది. ప్రతిపక్షంలో ఉన్నన్ని నాళ్ళు పార్టీలో నెంబర్ టూ ఎవరయ్యా అంటే ఆయన పేరే చెప్పుకునేవారు. జగన్ సైతం విజయసాయికి అన్నింటిలోనూ ప్రాముఖ్యత ఇచ్చేవారు. పార్టీకి సంబంధించిన అన్ని కీలక నిర్ణయాల్లోనూ విజయసాయి హస్తం ఉండేది. పార్టీకి సంబందించిన సోషల్ మీడియావిభాగం అయితే పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉండేది. 2019 ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడం వెనుక వైసీపీ సోషల్ మీడియా విభాగం కృషి చాలానే ఉంది. జగన్ ను ప్రమోట్ చేయడం సంగతేమో కానీ టీడీపీని మాత్రం విమర్శలతో తూట్లు పొడిచేశారు వైసీపీ సోషల్ మీడియా సోల్జర్స్. అలా పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా ద్వారా పెద్ద కృషే చేశారు విజయసాయి.
కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో మార్పు కనబడుతోంది. పార్టీలో కొందరు వ్యక్తులు అనూహ్యమైన రీతిలో ఎలివేట్ అయిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బుగ్గన, పేర్ని నాని, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి నాయకులు పార్టీలో కీలకంగా మారిపోయారు. పాలనకు సంబందించిన అన్ని నిర్ణయాల్లోనూ వీరి హస్తం ఉంటోంది. ఒకానొక దశలో విజయసాయిని ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయాలనే ప్రయత్నాలు కూడ జరిగాయి. కానీ విజయసాయి మాత్రం ఈ పోటీని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. జగన్ వద్ద తన పలుకుబడిని నిలబెట్టుకుంటూ కాబోయే రాజధాని విశాఖ వ్యవహారాలను గుప్పిటపట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బలం మాత్రమే చాలదని,ఎవరికీ లేని ప్రత్యేకత తనకు ఉండాలని విజయసాయి భావిస్తున్నారు.
అందుకే మొదటి నుండి తాను చూసుకుంటున్న సోషల్ మీడియా విభాగం మీద అధిక దృష్టి పెట్టారు. ఇప్పటివరకు వైసీపీ సోషల్ మీడియాను ఆ పార్టీలోని వేరే నాయకులు ఎవ్వరూ తాకలేదు. అదంతా టెక్నికల్ వ్యవహారం కాబట్టి, కుర్రాళ్లతో కూడుకున్న సంగతి కాబట్టి పెద్దగా వేలుపెట్టట్లేదు. అందుకే విజయసాయి ఆ విభాగం మీద ఇంకాస్త పట్టు పెంచుకుని తనకంటూ ఒక సొంత బ్రూప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈమధ్య కోర్టులు, న్యాయమూర్తుల మీద అనుచిత వాఖ్యలు చేసినందుకుగాను వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కొందరు వ్యక్తులకు కోర్టు నోటీసులు వెళ్లాయి.
సీఐడీ సరిగా విచారణ చేయట్లేదని వాటిని సీబీఐ చేతికి అప్పగించింది కోర్టు. దీంతో వ్యవహారం సీరియస్ అయింది. సోషల్ మీడియా సైనికుల్లో కంగారు మొదలైంది. నోటీసులు, సీబీఐ రంగప్రవేశం చూసి ఇకపై ఇంతకుముందులా వ్యవహరిస్తే కుదరదని గ్రహించి కొంత నెమ్మదించారు. వారిలో మునుపు ఉన్న ఊపు ఇప్పుడు కనిపించట్లేదు. ఇందుకు కారణం వారిలో పుట్టుకొచ్చిన భయమే. సీబీఐ కేసులో గనుక నోటీసులు అందుకున్నవారు గట్టిగా ఇరుక్కుపోతే వైసీపీ సోషల్ మీడియా విభాగం కొలాప్స్ అయిపోవడం ఖాయం. అదే జరిగితే విజయసాయికి ఉన్న పెద్ద బలం నీరుగారిపోయినట్టే అవుతుంది. ఆయనకంటూ చెప్పుకోవడానికి ప్రత్యేకత ఏమీ ఉండదు.
అందుకే త్వరపడిన ఆయన వైసీపీ సోషల్ మీడియాను తిరిగి యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. కేసులు మీదపడినంత మాత్రాన కార్యకర్తలను విస్మరించబోమని, అందరికీ అండగా ఉంటామనే నమ్మకం కలిగిస్తున్నారు. కేసుల్లో చిక్కుకున్నా బయటకు తీసుకొచ్చే బాధ్యత తనదని పరోక్షంగా భరోసా ఇస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తూ సోషల్ మీడియా సైనికులకు ధైర్యం నూరిపోస్తున్నారు. మునుపటిలా అందరినీ యాక్టివ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు బలంగా ఉంటేనే తాను పార్టీలో బలంగా ఉండగలననేది విజయసాయిరెడ్డిగారి వ్యూహం కావొచ్చు.