బీజేపీ సానుభూతిపరుడిగా మారిపోతున్న విజయసాయిరెడ్డి.!

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ (రాజ్యసభ), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.. సొంత పార్టీ కార్యకలాపాల్లో అంత చురుగ్గా పాల్గొనడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి విజయసాయిరెడ్డి సోషల్ మీడియా హ్యాండిల్‌లో చాలా తక్కువ పోస్టింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు అసలే లేవు.

వైసీపీ ప్రభుత్వంపై ఎవరెంతలా విమర్శలు చేసినా విజయసాయిరెడ్డి స్పందించడంలేదు. అలాగని, వైసీపీకి వ్యతిరేకంగా ఏమీ ట్వీట్లు చేయడంలేదాయన. తరచూ, వైసీపీకి అనుకూలంగా ట్వీట్లు వేస్తూనే వున్నారు. అదే సమయంలో, బీజేపీకి అనుకూలంగా.. కాదు కాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు వేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థించడం తక్కువైంది.. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని వెనకేసుకురావడం ఎక్కువైంది. ఈ మార్పుకి కారణమేంటి.? ఎప్పుడూ లేని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి అమితమైన ప్రేమ ప్రదర్శిస్తున్నారు.. అదీ సందర్భోచితంగానే లెండి.!

దీన్ని, వైసీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ముసలోళ్ళు ఇద్దరూ ఒక్కటయ్యారన్నమాట..’ అంటూ వైసీపీ అభిమానులు విజయసాయిరెడ్డి మీద మండిపడుతున్నారు. ఇద్దరు కాదు, ముగ్గురు.. ఆ లిస్టులో నరేంద్ర మోడీ కూడా వున్నారంటూ మరికొన్ని సెటైర్లు వైసీపీ మద్దతుదారుల నుంచి కనిపిస్తున్నాయి.

ఇంతకీ, ఏం జరుగుతోంది.? బీజేపీ వైపుగా విజయసాయిరెడ్డి అడుగులేస్తున్నారా.? బీజేపీ – టీడీపీ మధ్య అనుసంధాన కర్తగా ఆయన మారుతున్నారా.?