రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అంటే వైసీపీలో నెంబర్ 2 లీడర్ కిందే లెక్క. జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తి అనే పేరుంది పార్టీలో ఆయనకు. ఆరంభం నుండి జగన్ కు తోడుగా పక్కనే ఉన్న విజయసాయికి జగన్ ఎప్పటికప్పుడు ఉన్నత స్థానం ఇస్తూనే వచ్చారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపులో విజయసాయి పాత్ర ఎంతో ఉంది. అందుకే అధికారంలోకి వచ్చాక ఆయన్ను అందలం ఎక్కించారు. రాజ్యసభ సభ్యుడిగానే కాక పార్టీలోని కీలక బాధ్యతలను అప్పగించారు. విశాఖ బాధ్యతలను చూసుకోమని ఉత్తరాంధ్ర పగ్గాలిచ్చారు. ఢిల్లీలో పార్టీ తరపున వ్యవహారాలు చక్కబెట్టే పవర్ఫుల్ పోస్ట్ ఇచ్చేశారు. దీంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది.
ఆయన వస్తున్నారంటే జగన్ నీడ వస్తున్నట్టే కదిలిపోయేవారు ఒకప్పుడు పార్టీ నేతలు. జగన్ తీసుకునే నిర్ణయాల్లో విజయసాయి ప్రభావం తప్పకుండా ఉంటుందనేది వారి నమ్మకం, భయం కూడ. అందుకే ఎదిరించి మాట్లాడాలంటే జంకే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. విజయసాయి అంటే పార్టీలో భయం కొద్దిగా తగ్గిన ధోరణి వినిపిస్తోంది. అసంతృప్తులు కొందరు ఆయన మాటకు ఎదురుచెబుతున్నారు. ఎదురుగా నిలబడి చెప్పాలనుకున్నది మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అందుకు తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ.
ఇటీవల విశాఖపట్నం నుండి పార్టీ పరంగా పిర్యాదులు ఎక్కువయ్యాయి. విశాఖ బాధ్యత విజయసాయిరెడ్డిదే. అందుకే ఆయన గట్టిగా హెచ్చరికలు ఇస్తున్నారు నేతలకు. విశాఖలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన డెవలప్ మెంట్ అథారిటీ సమావేశంలో నాయకుల అవినీతి, అక్రమాలు ఎక్కువయ్యాయని అంటూ వార్నింగ్ ఇవ్వబోయారు. ఇంతలో చోడవరం ఎమ్మెల్యే కారణమా ధర్మశ్రీ కలుగజేసుకుని ప్రతి ఆక్రమణ వెనుక నేతలు ఉన్నారని అనడం, పదే పదే రాజకీయ నాయకుల అవినీతి అని ప్రస్తావించడం మీద అభ్యంతరం తెలిపారు.
తాను నిజాయితీపరుడినని, కావాలంటే విచారణ జరిపించాలని సభలో కరణం ధర్మశ్రీ వాగ్వాదానికి దిగారు. పాలవలస భూముల వ్యవహారంలో ఎన్వోసి చట్టబద్దత ఉంటే ఇవ్వాలని లేకుంటే లేదని అంతేకానీ ఇలా పదే పదే నాయకుల అవినీతి నాయకుల అవినీతి అంటూ ప్రస్తావించడం సబబుకాదని సభాముఖంగా దులిపేశారు. ఈ పరిణామంతో విజయసాయి సైతం ఖంగుతిని ఉండాలి. అసలు ఇతర నేతలైతే నెంబర్ 2 లీడర్ మీదకే ఎమ్మెల్యే ఇలా దూకేశాడేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారట.