భర్తను పోగొట్టుకుని ఇప్పటికే బాధపడుతున్న తనకు మళ్ళీ కడుపు మీద కొట్టొద్దంటూ వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుండి జగన్ పాదయాత్ర మొదలవుతున్న నేపధ్యంలో ఈరోజు విజయమ్మను మీడియాతో మాట్లాడించటం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. 20 నిముషాలు మాట్లాడిన విజయమ్మ సెంటిమెంటును రగిల్చే విధంగా మాట్లాడారు. హత్యాయత్నం జరిగిన విధానాన్ని ప్రస్తావించారు. హత్యాయత్నానికి పాల్పడాల్సిన అవసరం ఎవరికుందో ఆలోచించుకోమన్నారు.
హత్యాయత్నానికి అసలు విమానాశ్రయాన్నే ఎంచుకోవాల్సిన అవసరం ఏంటో కూడా ఆలొచించమని జనాలకు అప్పీల్ చేశారు. ఘటన జరిగిన తర్వాత సిట్ విచారణ జరిగిన తీరును కూడా తప్పుపట్టారు. తమకు నమ్మకం లేనిది ప్రభుత్వం మీదే కానీ పోలీసుల మీద కాదని స్పష్టం చేశారు. జరిగిన ఘటనను ప్రభుత్వం, అధికార పార్టీ, టిడిపి మీడియా కోడికత్తిగా అభివర్ణించటాన్ని కూడా ప్రస్తావించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్, జగన్ కు నాటకాలు ఆడటం తెలీదన్నారు.
ఘటన జరిగిన అర్ధగంటలోనే దాడి చేసింది జగన్ అభిమానే అని, ప్రచారం కోసం, సానుభూతి కోసమే దాడి చేయించుకున్నారని చెప్పాల్సిన అవసరం ఏమిటంటూ నిలదీశారు. ఘటన మొత్తం డ్రామాగా నిరూపించేందుకు ప్రభుత్వం ఫేక్ ఫ్లెక్సీలను, ఫొటోలను ఏర్పాటు చేయటాన్ని గుర్తుచేశారు. ఒకవేళ దాడి చేసింది జగన్ అభిమానే అయినప్పటికీ నిష్పాక్షికంగా విచారణ జరిపి నిజాలు బయటకు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అన్న విజయమ్మ ప్రశ్నకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో ?
వైఎస్ అయినా జగన్ కైనా నమ్మివాళ్ళను రక్షించుకోవటమే తెలుసు కానీ రిస్క లోకి తోయటం తెలీదని స్పష్టం చేశారు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని తన కోడలు భారతిని కూడా ఈడి కేసుల్లో ఇరికించి ఆనందిస్తున్నట్లు మండిపడ్డారు. జగన్ క్షేమం కోసం తాను ప్రార్ధన చేయగలనే కానీ నిజంగా రక్షించుకోవాల్సిన బాధ్యత అభిమానులపైనే ఉందన్నారు. గాయపడిని తన బిడ్డ త్వరగా కోలుకోవాలని ప్రార్ధన చేసిన ప్రతీ ఒక్కరికీ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న ప్రతీ విషయానికి పైన భగవంతుడు లెక్కలు చూస్తుంటాడని తీవ్రంగా హెచ్చరించటం గమనార్హం.