కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలను మన దేశంలో చూడటం అసాధ్యం. సోషల్ ఇంజినీరింగ్ పేరుతో ప్రజలను కులాల పేరిట వేరు చేస్తూ రాజకీయాలు చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న నేతలు కూడా బహిరంగంగా కులాలు, మతాల గురించి మాట్లాడుతారు. అధికారంలో ఉన్న నేతలైనా, ప్రతిపక్షంలో ఉన్న నేతలైన కూడా కులాల పేరుతో తమ పార్టీ భవిష్యత్ ను సిగ్గు లేకుండా నిర్మించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వైసీపీ నేత అయిన విజయసాయి రెడ్డి చేసిన కుల వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు కులతత్వవాది, టీడీపీ కులపిచ్చి పార్టీ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
అదే సమయంలో కులాలతో సంబంధంలేకుండా జగన్ అన్నివర్గాలకు న్యాయం చేస్తున్నారని సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబును వైసీపీలో చేర్చుకునేందుకు.. క్యాంప్ ఆఫీసుకు తీసుకు వచ్చిన విజయసాయి రెడ్డి..జగన్ తో కండువా కప్పించారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో…కులం గురించి మాట్లాడారు. ఓ వైపు… అన్నిరకాల పదవులు రెడ్లకే ఇస్తున్నారని.. రెడ్డియిజం రాష్ట్రంలో అమలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో విజయ చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ నేతలు ఆసక్తి కనపరుస్తున్నారు.
ఎంపీ విజయ సాయి చేసిన వ్యాఖ్యల వెనక సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహం ఉందని, ఆయన చెప్పలేని,చేయలేని కుల సంబంధమైన వ్యాఖ్యలను విజయసాయితో చేయించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు, జగన్ మోహన్ రెడ్డి పాలన కులం ఆధారంగా సాగుతుందని విమర్శిస్తుండటంతో జగన్ ఈ ఎదురు దాడికి పథకం రచించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గత కొన్ని రోజులుగా బీజేపీ కూడా వైసీపీ ప్రభుత్వం హిందువుల పట్ల ఆశ్రద్ద చూపుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వస్తున్న వ్యాఖ్యలకు చెక్ పెట్టడానికి జగన్ ముందుగా తన పథకాన్ని టీడీపీ నేతల మీద ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.