బాబోయ్.. ఆంధ్రాలో ఇదేమి బూతు పురాణం

ఆంధ్రాలో బూతు పురాణం మొదలైంది. ఆ బూతు అంతా ఇంతా కాదు.. గబ్బు గమారం అయిపోతున్నది. ఏకంగా ఎపి రాజకీయాలనే ఈ బూతు శాసించే స్థాయికి చేరింది. రాజకీయాల్లోకి ఈ బూతు ఎప్పుడో ప్రవేశించినా ఇప్పుడు తారా స్థాయికి చేరింది. ఏమిటా బూతు?? ఏమా కథ?? అనుకుంటున్నారా? అయితే చదవండి స్టోరీ.

ఆంధ్రా రాజకీయాలు ఫీల్డులో సెగలు కక్కుతున్నట్లే సోషల్ మీడియాలోనూ వేడిని రగలిస్తున్నాయి. ఒకవైపు జగన్, మరోవైపు పవన్ ఆంధ్రాలో జోరుగా పర్యటిస్తున్నారు. జగన్ పాదయాత్ర చేస్తుంటే పవన్ పోరాటయాత్ర చేపడుతున్నారు. ఇద్దరూ జనంలోనే ఉన్నారు. ఫీల్డులో ఎంత వేడి ఉందో సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువ వేడి పుట్టిస్తున్నాయి ఆంద్రా రాజకీయాలు. అయితే సోషల్ మీడియాలో ఒక మెట్టు పైకెక్కి బూతు లంకించుకుంటున్నారు.

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి బంద్ నిర్వహణపై మీడియాతో మాట్లాడుతూ పవన్ మీద వ్యక్తిగత విమర్శలకు దిగారు. పవన్ నిత్య పెళ్లి కొడుకు, కార్లను మార్చినట్లు పెళ్లాలను మార్చేస్తాడు అంటూ పర్సనల్ ఎటాక్ చేశారు. ఇదేదో నోరు జారి మాట్లాడిన మాటలు మాత్రం కాదని వైసిపి వర్గాలు కూడా అంటున్నాయి. పవన్ ను ఉద్దేశపూర్వకంగానే జగన్ మాట్లాడినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పదే పదే వైసిపి కి కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఉద్దేశంతో జగన్ ఈ తరహా ఎటాక్ మొదలు పెట్టారని అంటున్నారు. అయితే జగన్ ఉద్దేశం ఏదైనా రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు సరికాదని అందరూ కామెంట్ చేస్తున్నారు.

ఇక జగన్ కామెంట్స్ చేసిన క్షణాల్లో ఆ వార్త సోషల్ మీడియాలో అంటుకుంది. దీంతో అసలే ఉడుకు రక్తంతో ఉరకలు వేసే పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. జగన్ పర్సనల్ ఎటాక్ చేయడాన్ని ఖండిస్తూనే జగన్ మీద, జగన్ ఫ్యామిలీ మీద కూడా పర్సనల్ ఎటాక్ కు దిగారు. ఎంతగా అంటే జగన్ సోదరి గురించి, జగన్ సతీమణి గురించి కూడా ఇష్టానుసారం బూతు పోస్టులతో బాణాలు వదిలారు. అంతేకాదు జగన్ సోదరి వైవాహిక విషయాలను కూడా వెల్లడిస్తున్నారు. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకుంటే లేని తప్పు పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పా అంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొందరైతే మరీ రెచ్చిపోయి పుచ్చిపోతున్నారు. పవన్ కు మూడు పెళ్లిళ్లే కదా? నాలుగో భార్యగా జగన్ లింగ మార్పిడి చేసుకుని వస్తారా అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. అంతే స్థాయిలో వైసిపి శ్రేణులు కూడా ఢీ అంటే ఢీ అంటూ పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులకు అడ్డూ అదుపు లేకపోవడంతో ఇటు జగన్ అభిమానులు, అటు పవన్ ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. సందుట్లో సడేమియా అన్నట్లు టిడిపి శ్రేణులు కూడా ఇక్కడ రచ్చలోకి ఎంటర్  అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కు తన భార్యల సంఖ్య కంటే తక్కువ ఎమ్మెల్యే సీట్లే వస్తాయని రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన కామెంట్ పవన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో వారంతా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మీద పోస్టుల సునామీ సృష్టిస్తున్నారు.

హుందాగా సంయమనంతో మాట్లాడాల్సిన రాజకీయ నేతలు దారితప్పడంతో పార్టీల కార్యకర్తలు, ఫ్యాన్స్, అభిమానులు రెచ్చిపోతున్నారు. వారి రెచ్చిపోవుడుకు అవధులు లేకుండాపోతున్నాయి. సోషల్ వర్కర్స్ ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధినేతల మీదనే ఉందని జనాలు అంటున్నారు. వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటివి ఓపెన్ చేయాలంటేనే సామాన్యులు బూతు భయంతో భయపడే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. తిట్టుకుంటే తిట్టుకున్నారు కానీ.. బూతు డోస్ తగ్గిస్తే మంచిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

గమనిక : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బూతు పోస్టులు, బూతు ఫొటోలు అసభ్యకరంగా ఉండడంతో మేము ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం.