లోకేష్ కు బ్యాడ్ న్యూస్… వారాహి పార్ట్ – 2 డేట్ ఫిక్స్!

తొలివిడత వారాహియాత్రలో భాగంగా సుమారు రెండు వారాలపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అవిరామంగా తిరిగిన పవన్ కల్యాణ్… యాత్ర ముగిసిన అనంతరం షూటింగుల్లో బిజీ అయిపోయారని అంటున్నారు! దీంతో వారాహి యాత్ర పార్ట్ 2 ఇప్పట్లో ఉండదేమో అని చాలా మంది భావించారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ వెలుగులోకి వచ్చేసింది!

అవును… అన్నవరంలో పూజ అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సభతో మొదలైన వారాహి యాత్ర సభాపర్వం… జూన్ 30న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సభతో ముగిసింది. మూడు మాటలు అంటూ, ఆరు మాటలు అనిపించుకుంటూ, చెప్పులు పోగొట్టుకుంటు, అవి ఎక్కడ ఉన్నాయో వైసీపీ నేతలతో అడ్రస్ చెప్పించుకుంటూ, స్థిరత్వం స్పష్టత లేని మాటలు మాట్లాడుతూ ఈ యాత్ర జరిగిందంటూ ఆన్ లైన్ వేదికగా అనేక రకాల కామెంట్లు వినిపిస్తుండగా… మరోపక్క ఈ యాత్రతో పవన్.. చంద్రబాబుని వెనక్కి నెట్టారు అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో త్వరలోనే జనసేన వారాహి యాత్ర పార్ట్ – 2 వాహనం సిద్ధమవుతోందని, పవన్ రెడీ అవుతున్నారని చెబుతున్నారు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా స్పందించిన ఆయన… . ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఈ యాత్ర త్వరలో మొదలవ్వబోతోందని ప్రకటించారు. ఈ క్రమంలో త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు.

అయితే జూలై 9 నుంచే వారాహి యాత్ర పార్ట్ – 2 ఉండొచ్చని ఒక పోస్ట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అందుకు నిర్మాతలు ససేమిరా అంటున్నారని తెలుస్తుంది. షూటింగులు పూర్తి చేయమని వేడుకుంటున్నారని సమాచారం. ఇదే సమయంలో ఈ నెలలో చంద్రబాబు జిల్లాల టూర్ కూడా ఉండటంతో… చంద్రబాబు నుంచి కూడా అనుమతి రాకపోవచ్చనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!

ఆ సంగతులు అలా ఉంటే… వారాహి యాత్ర పుణ్యమాని లోకేష్ యువగళం పాదయాత్రను పట్టించుకున్న నాథుడే లేడనే మాటలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. టీడీపీ అనుకూల మీడియా సైతం లోకేష్ పాదయాత్రను లైట్ తీసుకుందనే కామెంట్లు వినిపించాయి. అయితే గత రెండు మూడు రోజులుగా మళ్లీ లోకేష్ యాత్రకు కాస్త కవరేజ్ దొరుకుతుంది. దీంతో వైసీపీ నేతలపై లోకేష్ విరుచుకుపడిపోతున్నారు.

ఈ నేపథ్యంలో వారాహి పార్ట్ – 2 త్వరలోనే ప్రారంభమైపోద్దనే వార్తలు వస్తోన్న తరుణంలో… ఇది కచ్చితంగా లోకేష్ కు బ్యాడ్ న్యూసే అని అంటున్నారు పరిశీలకులు. వారి అనుకూల మీడియా సైతం పవన్ కు ఇస్తోన్న కవరేజ్ లో పదోవంతు కూడా లోకేష్ కి ఇవ్వడంలేదని అభిప్రాయపడుతున్నారు. మరి జూలై నెలలో జనసేన – టీడీపీ పాలిటిక్స్ లో ఏమి జరగబోతోంది అన్నది వేచి చూడాలి!