ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన వారాహి యాత్రకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇందులో భాగంగా వారాహి యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారని తెలిసింది. ఈ మేరకు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్ నెక్స్ట్ అనేది త్వరలో చెబుతామని చెప్పుకొచ్చారు.
అవును… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంపిక చేయబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికే యాత్రను పూర్తిచేసుకున్న పవన్… ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా భీమవరంలో ఈ నెల 30న జనసేన బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఆ సభ అనంతరం పవన్ విరామం తీసుకోనున్నారని తెలుస్తుంది.
అయితే కేవలం ఈ నియోజకవర్గాల్లోనే పవన్ వారాహి యాత్ర చేయడంపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ వారాహి యాత్ర సాగింది. దీంతో… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ఎనిమిది నియోజకవర్గాల్లోనే జనసేన పోటీ చేయబోతుందనే చర్చ నడుస్తుంది.
ఇదే సమయంలో పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు… ఈ స్థానాల్లో పోటీచేయడానికి జనసేనకు ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. అందులో భాగంగానే పవన్ ఈ సెలక్టివ్ నియోజకవర్గాల్లో యాత్ర చేశారని అంటున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగుతుంది.
దీంతో పాలకొల్లు మినహా నరసాపురం, భీమవరంలో జనసేన పోటీ ఉండొచ్చని.. వీటిలో ఏదో ఒక నియోజకవర్గంలో పవన్ పోటీచేయొచ్చని కూడా కథనాలొస్తున్నాయి. అయితే పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలకంగా ఉన్నారు కాబట్టి.. ఆ సీటును వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండే ఛాన్స్ లేదు.
అయితే పవన్ వారాహియాత్ర కు భీమవరం సభ అనంతరం ఇచ్చేది విరామమా.. లేక, శుభం కార్డేనా అనే చర్చ గోదావారి జిల్లాల్లో జోరందుకుంది. ఇప్పుడూ గ్యాప్ ఇస్తే పవన్ మళ్లీ రోడ్లపైకి రావాలంటే చాలా కాలమే పడుతుందని అంటున్నారు. పైగా వరుసగా నాలుగు సినిమాలు పవన్ రాకకోసం ఎదురుచూస్తున్నాయి.. వాటిని సంబంధించి నిర్మాతలనుంచి ఒత్తిడి కూడా ఉందని అంటున్నారు.
దీంతో… ఈ ఏడాదికి ఇంక పవన్ వారాహి యాత్ర పార్ట్ 2 ఉండకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వత ఇక ఎన్నికలు వచ్చేవరకూ పవన్ యాత్ర అవిరామంగా కొనసాగొచ్చని తెలుస్తుంది. అయితే… ఈ విషయాలపై అధికారికంగా కన్ ఫర్మేషన్ రావాల్సి ఉంది.