మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తోన్న ‘యువగళం’ పాదయాత్రలో కనిపించారు. దివంగత వంగవీటి రంగా తనయుడైన వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతానికి టీడీపీలోనే వున్నారు. గతంలో ఆయన వైసీపీలో పనిచేశారు. జనసేనతో గత కొన్నాళ్ళుగా టచ్‌లో వున్నారు.
ఫలానా పార్టీలో వున్నాగానీ, ఆయా పార్టీల్లో వున్నట్టుండరాయన. అదే వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేకత. నిలకడలేమి.. ఆయనకు ఎక్కువ. అందుకే, ఏ పార్టీలోనూ ఎక్కువకాలం వుండలేరు. తండ్రి వంగవీటి రంగా పేరు చెప్పుకోవడం తప్ప, తనకంటూ పొలిటికల్ ఇమేజ్ ఏమాత్రం ఏర్పరచుకోలేకపోయారు రాధాకృష్ణ.
త్వరలో జనసేనలో వంగవీటి రాధాకృష్ణ చేరతారన్న ప్రచారంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరపడిన మాట వాస్తవం. కానీ, జనసేన పార్టీ ఈ విషయాన్ని లైట్ తీసుకుంది. జనసేన వైపు వంగవీటి రాధాకృష్ణ వెళతారేమోనన్న ఆందోళనతో ఆయన చుట్టూ తిరిగారు వైసీపీ నేత కొడాలి నాని.
మరోపక్క, వంగవీటి రాధాకృష్ణ వేరే పార్టీలోకి వెళ్ళకుండా తెలుగుదేశం పార్టీ పడుతున్న పాట్లు సరే సరి. టీడీపీ వర్సెస్ వైసీపీ.. వంగవీటి రాధాకృష్ణ చుట్టూ ఓ చిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఆయన కూడా ఆ గందరగోళాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే, జనసేన ఆయన్ని ఎంటర్టైన్ చేయలేదని అనుకోవాలేమో.
కారణాలేవైనా, వంగవీటి రాధాకృష్ణ కాస్తా నారా లోకేష్ యాత్రలో కనిపించడంతో, జనసేన వర్గాలు కొంత షాక్‌కి గురయ్యాయి. మొన్న కన్నా లక్ష్మినారాయణ, అంతకు ముందు మహాసేన రాజేష్.. జనసేనలోకి వస్తారనుకుంటే, టీడీపీ వైపు తిరిగారు. ఇప్పుడేమో వంగవీటి రాధాకృష్ణదీ అదే పరిస్థితి.