25న టిడిపిలోకి రాధ..ఎసరు ఖాయమేనా ?

మొత్తానికి వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశంపార్టీలో చేరటానికి రంగం సిద్ధమైంది. ఈనెల 25వ తేదీన రాధా టిడిపిలో చేరబోతున్నట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పారు. క్యాబినెట్ సమావేశం తర్వాత జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్యలతో చంద్రబాబు మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన వంగవీటి రాధా టిడిపిలో చేరుతున్నట్లు చెప్పారు. ఏదో అడగాలి కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను అడిగారంతే.

రాధా పార్టీలో చేరిన తర్వాత అందరూ కలుపుకుని వెళ్ళాలని కూడా ఆదేశించారు. ఇప్పటి వరకూ ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టేసి అందరూ కలిసి పనిచేసుకోవాలని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి రాధా వల్ల టిడిపికి వచ్చే ప్రత్యేకమైన లబ్ది ఏమీ లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. పైగా మొన్నటి వరకూ రాధా వల్ల ఇబ్బందులు పడ్డ నేతలు రేపటి నుండి టిడిపిలో పడాల్సుంటుందని అంటున్నారు. ఎందుకంటే, విజయవాడ  సెంట్రల్  నియోజకవర్గంలో పోటీ చేయటమే రాధా ఏకైక లక్ష్యం. టిక్కెట్టు ఇవ్వటం కుదరదని జగన్మోహన్ రెడ్డి చెప్పటం వల్లే రాధా వైసిపిని వదిలేశారు.

మరి అదే నిజమైతే టిడిపిలో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో టిక్కెట్టు దక్కే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే, టిడిపిలో సిట్టింగ్ ఎంఎల్ఏ బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఒకవేళ రాధాకు సెంట్రల్ లో టిక్కెట్టివ్వాలంటే బోండాను చంద్రబాబు పక్కనపెట్టేయాలి. సిట్టింగ్ ఎంఎల్ఏ అయిన తనకే టిక్కట్టు నిరాకరిస్తే మరి బోండా ఊరుకుంటారా ? ఇపుడీ విషయం పైనే టిడిపిలో బాగా చర్చ జరుగుతోంది. అంటే రాధా రాకవల్ల బోండా టిక్కెట్టుకు ఎసరొస్తున్నట్లే అనుకోవాలి. రాధాకు ఎంఎల్సీ పదవిని చంద్రబాబు హామీనిచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి అదే హామీని జగన్ కూడా ఇచ్చారు. జగన్ మాటను కాదన్న రాధా చంద్రబాబు హామీని నమ్ముతారా ? చూడాలి టిడిపి సెంట్రల్ రాజకీయాలు ఏ విధమైన మలుపులు తిరుగుతాయో ?