సంచలనం : తనను చంపేస్తానంటూ బెదిరింపులు..మీడియాపై విరుచుకుపడిన రాధా

పార్టీలో ఉన్నంత కాలం తనకు వైసిపిలో తీరని అవమానాలు ఎదురైనట్లు వంగవీటి రాధాకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణను కూడా సహించలేకపోయినట్లు మండిపడ్డారు. పార్టీ అనుమతి లేకుండా విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు కూడా పార్టీ అధిష్టానం అనుమతి తీసుకోవాలని తనపై ఆంక్షలు విధించి తనను ఘోరంగా అవమానించారని వాపోయారు. తండ్రి లేనివాడివనే తనను పార్టీలో చేర్చుకున్నట్లుగా తనను జగన్మోహన్ రెడ్డి పదే పదే అవమానించారంటూ మండిపోయారు. తనపై జనాలందరూ అభిమానం చూపారేకానీ జాలి చూపలేదని చెప్పారు.

తాను ఏ పార్టీలో ఉన్న తన తండ్రి రంగా ఆశయాల సాధనకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. జగన్ నుండి తనక జరిగిన అవమానాలు ఇంకే నేతకు జరక్కూడదంటూ రాధా చెప్పారు. తనను  చంపేస్తానని కొందరు బెదిరిస్తున్నారని, తనకు తాడు బొంగరం లేదు కాబట్టి తననేం చేసినా నష్టం లేదన్నారు. పార్టీలో చేర్చుకునేటపుడు సొంత తమ్ముడికంటే ఎక్కువగా చూసుకుంటానని చెప్పిన జగన్ చివరకు తనను అవమానాలకు గురిచేసినట్లు మండిపడ్డారు. జగన్ తన పద్దతి మార్చుకోవాలని సలహా ఇచ్చారు. జగన్ తో కలసి తాను ప్రయాణం చేయాలని అనుకుంటే చివరకు తన క్రింద పనిచేయాలని జగన్ చెప్పటం ఎంత వరకూ భావ్యమంటూ నిలదీశారు.

ఆంక్షలు లేని ప్రయాణం చేయాలని అనుకుంటే వైసిపిలో సాధ్యం కాలేదన్నారు. నిజానికి ఏ పార్టీలో అయినా ఆంక్షలు లేని ప్రయాణం రాధాకు ఎప్పటికీ సాధ్యం కాదన్న విషయం అర్ధం చేసుకోవాలి. రేపు టిడిపిలో చేరితే మాత్రం చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలే కానీ తనిష్టం వచ్చినట్లు పనిచేస్తానంటే కుదరదు. ఇక, వైసిపిలో ఎంఎల్ఏ అంటే కూడా గౌరవం లేదంటున్నారు. మరి 40 మంది ఎంఎల్ఏలు ఎలా ఉంటున్నారు ? రూ 100 కోట్లు తీసుకునే తాను టిడిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పడేశారు. తన తండ్రిని టిడిపినే చంపించిందని తాను ఎప్పుడూ చెప్పలేదని ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.

తెలుగుదేశంపార్టీలోకి రమ్మని తనను చంద్రబాబునాయుడు ఆహ్వానించినట్లు చెప్పారు. టిడిపిలో చేరి తన తండ్రి ఆశయాలను కొనసాగించాలని చంద్రబాబు చెప్పినట్లు రాధా తెలిపారు. టిడిపిలో చేరే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడారు. టిడిపిలో ఎప్పుడు చేరేది చెప్పమని అడిగిన మీడియాపై రాధా తీవ్రస్ధాయిలో విరుచుకుపడటం ఆశ్చర్యంగా ఉంది. తన క్యారెక్టర్ ను వైసిపి నాలుగేళ్ళుగా చంపేసిందంటూ నిందెలేశారు. రాబోయే ఎన్నికల్లో తన వ్యక్తిగత మద్దతు ఎవరికిస్తారో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఎంతసేపు తన తండ్రి ఆశయం అని అంటారే కానీ అందుకు తాను చేసిన కృషిని మాత్రం చెప్పలేదు. వేలాదిమందికి ఇళ్ళపట్టాలు ఇవ్వమని మాత్రమే చంద్రబాబును కోరారు.