హత్యకు గురైన ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా రాసినట్లుగా భావిస్తోన్న ఓ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముహూర్తం ఖాయం చేసుకున్న నేపథ్యంలో.. అప్పుడెప్పుడే రంగా ప్రజలను ఉద్దేశించి రాసిన కరపత్ర రూపంలో ఉన్న ఈ లేఖ మరోసారి వెలుగులోకి వచ్చింది.
`సోదర, సోదరీమణులకు వంగవీటి మోహనరంగా విజ్ఞప్తి` అనే శీర్షికతో అప్పట్లో ఇది వెలువడింది.ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే తాను అరెస్టుకు గురయ్యానని, తన బట్టలు సైతం ఊడదీయించి, అవమాన పరిచిన విషయం విదితమే..అంటూ ఈ లేఖ ఆరంభమౌతుంది. కులతత్వం మూర్తీభవించిన ప్రభుత్వాధినేత ఎన్టీఆర్ తన మీద కులకక్షతో, కుట్ర కుయుక్తులతో అణచివేతను మొదలు పెట్టారని రంగా ఈ లేఖలో పేర్కొన్నారు.
తాను అణచివేతకు గురవుతున్నాననే విషయాన్ని గ్రహించిన సాటి సోదరులు కాపు మహాసభల ద్వారా ఉద్యమం ఆరంభించారని, దీనికి కుల, మత ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలు తరలి వస్తున్నారని అన్నారు..ఇలా సాగుతుందీ లేఖ సారాంశం. వంగవీటి రాధా టీడీపీలో చేరడానికి మూడురోజుల ముందే ఇది తెరపైకి వచ్చింది. రాధా తీసుకున్నది సరైన నిర్ణయం కాదని చెప్పడమే తమ ఉద్దేశమని రంగా అభిమానులు చెబుతున్నారు.