ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వాతావరణం వర్షాలతో చల్లబడినా.. రాజకీయ వాతావరణం మాత్రం రోహిణీ కార్తి వేడిని తలపిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా వంగవీటి రంగా కుటుంబానికి సంబంధించిన ఒక వార్త తెరపైకి వచ్చింది. దీంతో… ముఖ్యంగా బెజవాడ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుందని తెలుస్తుంది.
బెజవాడ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈసమయంలో బెజవాడ రాజకీయాలలో వంగవీటి రంగా కుమార్తె ఆశాలత పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. త్వరలో ఆమె రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
అవును… స్వర్గీయ వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయాల్లోకి రానున్నారని చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఆమె బెజవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. వంగవీటి రంగా రాజకీయ వారసత్వాన్ని బలంగా జనంలోకి తీసుకుపోవడానికి ఆయన కుమార్తె ఆశాలతను ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే రంగా ఫ్యామిలీ నుంచి పాలిటిక్స్ లోకి రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాను కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అటు రత్నకుమారి కానీ, ఇటు రాధాకృష్ణ కానీ వారి అభిమానులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారనే వాస్తవం!
వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్నప్పటికీ ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తారు. ఈ మధ్యకాలంలో లోకేష్ పాదయాత్రలో ఒకసారి కనిపించారు. అనంతరం పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు! ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో వెళ్లబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉందని అంటున్నారు.
ఆశాలత విజయవాడతో పాటు గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడంలో ఉపయోగపడుతుందని పార్టీలు భావిస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా… దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వంగవీటి ఆశాలతను పార్టీలోకి స్వాగతించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రంగా అభిమానులు తమకు ఓటుబ్యాంకుగా మారతారని భావిస్తున్నారు.
అయితే వంగవీటి ఆశాలత రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా టీడీపీ నుంచి ఆమె పోటీ ఉండకపోవచ్చని అంటున్నారు. ఆమె తండ్రి రంగా హత్యలో టీడీపీ పాత్ర ఉందని పలువురు కాపుసామాజికవర్గ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో… ఆమె ఆ ఆలోచన చేయకపోవచ్చని అంటున్నారు.
ఇక జనసేనలో చేరే విషయంలో కూడా ఆమె తర్జన భర్జన పడుతున్నారని సమాచారం! అక్కడ ఆమెకు సముచిత స్థానం దక్కుతుందనే నమ్మకం లేదనేది పలువిరి అభిప్రాయంగా ఉంది. పైగా జనసేన అంటే టీడీపీకి బీ టీం అనే కామెంట్లు వినిపిస్తోన్న నేపథ్యంలో… ఆమె ఆ సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఈ సమయంలో వైసీపీ నుంచి ఆమె రంగంలోకి దిగొచ్చని తెలుస్తుంది. వైఎస్సార్ కు రంగాకూ ఉన్న అనుబంధం మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మరి వంగవీటి రంగా కుమార్తె ఆశాలత జరుగుతున్న చర్చల మేరకు రాజకీయాల్లోకి వస్తారా.. వస్తే విజయవాడ సెంట్రల్ నుంచే పోటీ చేస్తారా.. చేస్తే వైసీపీ నుంచే పోటీచేస్తారా అనేది వేచి చూడాలి!