పొలిటికల్ హీట్ పెంచేసిన వంగవీటి..బోండాకే ఎసరు ?

వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారు అన్నది ఆశక్తిగా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టిడిపి ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావుకు ఎసరు  పెట్టనున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా షెడ్యూల్ ఎన్నికలకు ముందు టిక్కెట్టు విషయంలో పేచి వచ్చి రాధా వైపికి రాజీనామా చేయటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. సరే సెంట్రల్ నియోజకవర్గంలో టిక్కెట్టు దక్కదని అర్ధమైన తర్వాత వంగవీటి పార్టీకి రాజీనామా చేశారన్నది స్పష్టమైపోయింది.

 నిజానికి రాధా పార్టీకి రాజీనామా చేస్తారన్నది ఎప్పటి నుండో అందరూ ఊహిస్తున్నదే. సెంట్రల్ నియోజకవర్గంలో జగన్ ఎప్పుడైతే మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణును, తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి రవిని రంగంలోకి తెచ్చారో అప్పుడే రాధా నిష్క్రమణ ఖాయమైపోయింది. కాకపోతే ఇంత కాలం బేరాల పేరుతో, అలకల డ్రామాతో రాజకీయం సాగింది.

సరే వైసిపికి రాజీనామా చేసినందు వల్ల రాధా చాప్టర్ వైసిపిలో ముగిసిపోయింది. మరి కొత్త ఇన్నింగ్స్ ఎలా మొదలుపెడతారన్నది ఆశక్తికరంగా మారింది. ఎందుకంటే, రాధా వైసిపిని వదిలేస్తే రెండు ఆప్షన్లున్నాయి. మొదటిది టిడిపిలో చేరటం. రెండోది జనసేనలో చేరటం. టిడిపిలో చేరిని ప్రస్తుతానికి సెంట్రల్ నియోజకవర్గంలో స్ధానం ఖాళీ లేదు. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావు ఉన్నారు. అలాగే, తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు ఉన్నారు. ఇద్దరు కూడా పార్టీలో బాగా యాక్టివ్ గా నే ఉన్నారు.

కాబట్టి వంగవీటి కోసమని వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చంద్రబాబు పక్కన పెట్టే అవకాశం లేదు. ఇక మిగిలింది జనసేన మాత్రమే. జనసేనే ఎందుకంటే, ఆ పార్టీకి ఎక్కడ కూడా అభ్యర్ధులు లేరు కాబట్టే. అందువల్ల రాధా కోరుకుంటున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్టును కేటాయించటానికి పవన్ కల్యాణ్ కు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. జనసేనలో టిక్కెట్టైతే తెచ్చుకోగలరు కానీ విజయం మాటేమిటి ?

రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తులు పెట్టుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగినా పొత్తుల్లో సెంట్రల్ టిక్కెట్టు కోసం చంద్రబాబునాయుడు పట్టుబట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. లేకుంటే బోండా తదితరుల నుండి సమస్యలు మొదలవుతాయి. వైసిపిలో ఉన్నంత కాలం రాధాను బోండా, బుద్దా వెంకన్న లాంటి వాళ్ళు టిడిపిలోకి ఆహ్వానించారు. అదే టిడిపిలో చేరిన తర్వాత తమ నియోజకవర్గాలకే ఎసరు పెడతారని ఊహిస్తే వాళ్ళు మాత్రం ఎందుకు ఆహ్వానిస్తారు . ఇపుడు జరగబోయేదేమిటో చూడాల్సిందే. టిడిపిలో నేరుగా టిక్కెట్టు సాధ్యం కాదన్నపుడు జనసేనలో చేరి సెంట్రల్ టిక్కట్టు తెచ్చుకోవటం ఒకటే వంగవీటి రాధాకు మిగిలిన ఆప్షన్. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.