ఉద్దేశ్యపూర్వకంగానే వైసీపీని వంశీ దెబ్బతీస్తున్నారా.?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు. నిజానికి, ఆయనేమీ వైసీపీ అధిష్టానాన్ని విమర్శించడంలేదు. పైగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ, గతంలో ఆయన టీడీపీలో వున్నప్పుడూ అదే పరిస్థితి. చంద్రబాబుని ఏమీ అనేవారు కాదాయన.

కానీ, టీడీపీలో కొందరితో తగాదా పెట్టుకునేవారు. చివరికి టీడీపీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీలో ఇప్పుడు వల్లభనేని చేస్తున్నదీ అదే. ఈ మధ్యనే టీడీపీని గొప్ప పార్టీగా అభివర్ణించిన వల్లభనేని వంశీ, ఆ తర్వాతి నుంచి వైసీపీలో పంచాయితీలు షురూ చేశారు. వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచందర్‌రావులతో  ఆధిపత్య పోరు పెంచుకున్నారు. వైసీపీలో ఇప్పుడు వైసీపీ వర్గం, వైసీపీ వ్యతిరేక వర్గంగా మారిపోయింది పరిస్థితి. కాదు కాదు, వైసీపీ వర్గం.. వైసీపీలో వల్లభనేని వర్గం అన్నట్టు తయారైంది వ్యవహారం.

‘అరిచే కుక్క కరవదు..’ అంటూ వంశీ మీద, వైసీపీ నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ వైసీపీ నేతలెవరో కాదు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచందర్ రావు. మట్టిని మింగేసిన రాక్షుడంటూ వల్లభనేని వంశీ మీద విమర్శల తీవ్రత పెంచారు వైసీపీ నేతలు.

అయితే, వైఎస్ జగన్ పాలన నచ్చి, నియోజకవర్గ ప్రజలకు తనవంతుగా మేలు చేసేందుకే వైసీపీకి మద్దతిచ్చానన్నది వల్లభనేని వంశీ చెబుతున్నమాట. వల్లభనేనిని కదిపితే ఏమవుతుందో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు.

తన మీద గతంలో వల్లభనేని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం కూడా వైఎస్ జగన్‌కి గుర్తుండే వుంటుంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందేమోనని వైఎస్ జగన్ ఉపేక్షిస్తున్నారు.

కానీ, ఇలా ఉపేక్షించుకుంటూ పోతే, మొదటికే మోసమొస్తుందని వైఎస్ జగన్ తెలుసుకోకపోతే ఎలా.?