వల్లభనేని వంశీకి గాలమేస్తున్న చంద్రబాబు.!

రాజకీయాల్లో ఇట్నుంచి అటు దూకడం ఎంతవ తేలికో, అట్నుంచి ఇటు దూకడం కూడా అంతే తేలిక.! ఒక్కసారి దూకడం అలవాటైపోతే, గోడ మీద పిల్లుల్లా, తక్కెడలోని కప్పల్లా రాజకీయ నాయకులు మారిపోతుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తన ఉనికిని చాటుకున్న నేపథ్యంలో, ముందు ముందు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గాలి బలంగా వీయబోతోందన్న ప్రచారమైతే తెరపైకొచ్చింది. వైసీపీ అనుకూల మీడియా కూడా దీన్ని అంగీకరిస్తున్న దరిమిలా.. వైసీపీలో కొందరు నేతలు, ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించడంలో వింతేముంది.?

వైసీపీలోకి చాలాకాలం క్రితమే జంప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రస్తుతానికైతే తాను వైసీపీలోనే వున్నానని అంటున్నారుగానీ, ఆయనతో టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్ళారనే ప్రచారమైతే గట్టిగా సాగుతోంది. ‘ఎమ్మెల్యేలను కొనేయడంలో మా మాజీ బాస్ చంద్రబాబు సిద్దహస్తుడు..’ అంటూ నవ్వుతూ చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం వల్లభనేని వంశీ.

మరోపక్క, ‘ఓ పార్టీ నుంచి బీ-ఫామ్ తీసుకుని, వేరే పార్టీ వైపు వెళ్ళడమంటే ఓ అమ్మకీ అబ్బకీ పుట్టినోళ్ళు చేసే పని కాదు..’ అంటూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ చేసిన వ్యాఖ్యలు ఎక్కడో వల్లభనేని వంశీకి చివుక్కుమనేలా చేశాయట. ఇంకోపక్క, మంత్రి రోజా కూడా పార్టీ మారిన ఎమ్మెల్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అదీ వల్లభనేని వంశీ సమక్షంలో. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీనే, టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్ళారనే ప్రచారమూ జరుగుతోంది.వంశీ నిజంగానే టీడీపీ వైపు మళ్ళీ చూస్తారా.? వేచి చూడాల్సిందే.