గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరు వివాదాస్పందంగా మారుతోంది. టీడీపీ నుండి గెలుపొందిన ఆయన వెళ్ళను వెళ్ళను అంటూనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో ఉంటూనే చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ వైసీపీకి మద్దతిస్తున్నారు. ఆయన వెళ్లిపోవడంతో టీడీపీకి నష్టం జరిగింది లేదో తెలియదు కానీ ఆయన చేరికతో వైసీపీకి మాత్రం డ్యామేజ్ జరుగుతోంది. వల్లభనేని వంశీకి మొదటి నుండి పవర్ పాలిటిక్స్ చేయాలనేది ఆశ. టీడీపీ పరిస్థితి బాగున్నప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా ఉంటూ వచ్చి ఎప్పుడైతే పార్టీ దెబ్బతిన్నదో చేతులెత్తేసి వెళ్లిపోయారు. జగన్ సైతం మౌనంగానే వల్లభనేని వంశీ చేరికను సమ్మతించారు.
ఆయన రావడంతో టీడీపీ పరిస్థితి ఖతమైనట్టే అనుకున్నారు. కానీ వైసీపీలో కల్లోలం మొదలైంది. చేరిన వెంటనే పెత్తనం చేయడం మొదలుపెట్టారు వంశీ. తాను ఎమ్మెల్యేను కాబట్టి పార్టీలో పెత్తనం మొత్తం తనదే అయ్యుండాలని పట్టుబట్టారు. ఈక్రమంలో దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వర్గాలకు వంశీ పద్దతి నచ్చలేదు. గన్నవరం వైసీపీలో వర్గమని వంశీ అనడాన్ని తట్టుకోలేకపోయారు. ఎమ్మెల్యే అయినంత మాత్రనా పెత్తనం చేస్తే ఊరుకోమన్నట్టు హెచ్చరించారు. దీంతో వంశీ ఎవరైతే ఎదురుతిరిగుతున్నారో వారిని అణగదొక్కడం మొదలుపెట్టారు. నియోజకవర్గం యంత్రాగాన్ని, అధికారులను అదుపులో పెట్టుకున్నారు. ఇంకేముంది ప్రతి విషయంలోనూ గొడవే.
ఒకానొక వైఎస్ జగన్ వారి చేతులు కలిపినా సమస్య తీరకలేదంటే ఇరు వర్గాల నడుమ అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇక ప్రత్యర్థులను దెబ్బకొట్టే క్రమంలో వంశీ ప్రభావం వైకాపాలో ఉన్న చిన్న చితకా లీడర్ల మీద పడింది. క్షేత్ర స్థాయిలో దెబ్బకొడితే పై నాయకులు బలహీనపడతారనే ఉద్దేశ్యంతో వారిని అన్ని విధాలా లాక్ చేసేశారు. చిన్న చిన్న కాంట్రాక్టులను కూడ వారి వరకు పొవట్లేదట. దీంతో అన్నీ అమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు ఎవరో బయటి వ్యక్తి వచ్చి పెత్తనం చేయడం ఏమిటని రగిలిపోయారు. ఇలాగే ఉంటే పార్టీలో ఎలాంటి గుర్తింపు ఉండదని, పనులుఅసలే జరగవని ఆవేదన చెందారు.
ఆ ఆవేదనతోనే జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి జోజిబాబు ఏకంగా ఆత్మహత్య చేసుకోబోయారు. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయారు. సమయానికి పక్కనే ఉన్నవారు ఆపారు కానీ లేకుంటే ఘోరం జరిగిపోయేది. ఇంత కష్టపడినా పార్టీలో అన్యాయం జరుగుతోందని, తనకిద్దరు పిల్లలున్నారని బాధను వెళ్లగక్కాడు. ఇలా జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి బాధను తట్టుకోలేక చనిపోవాలని అనుకున్నాడంటే అతన్ని ఏ స్థాయిలో ఇబ్బందులు పెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎక్కువైన ఈ వార విబేధాలు పార్టీ శ్రేణుల్లో చీలిక తీసుకురాగా నేతలు సైతం ఇలా బాధలుపడటం చూస్తుంటే పనిగట్టుకుని వంశీ పార్టీని దిగజార్చుతున్నట్టు ఉంది. ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ పతనం మొదలైనట్టే.