కిషన్ రెడ్డి గురివింద కబుర్లు వినతరమా?

తాజాగా ఏపీ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… గతం మరిచి, వర్తమానం విడిచి.. జనాలకు అంత జ్ఞానం లేదనే తనదైన జ్ఞానంతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నెట్టింట కామెంట్లు వీరవిహారం చేస్తున్నాయి.

“ఏపీలో కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి”! ఇది కిషన్ రెడ్డి చెప్పిన మాట! అందుకు ఆయనకు కనిపించిన సందర్భం ఏదో తెలియదు కానీ.. కేంద్రంలో బీజేపీ పెద్దలు చేస్తున్న విషయాలను దాచి – ఏపీ సర్కార్ పై బురదలజ్జే కార్యక్రమం మొదలుపెట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ లను ప్రయోగిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది అని దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలూ కోడై కూస్తున్న సమయంలో… తప్పు చేసిన ఒకరిద్దరు నేతలను అరెస్టు చేస్తే… ఏపీలో కక్షసాధింపు రాజకీయాలు నడుస్తున్నాయనై చెప్పుకొస్తున్నారు.

ఇదే క్రమంలో… ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయనేది కిషన్ రెడ్డి నోటి నుంచి జాలువారిన మరో ఆణిముత్యం! పక్క పార్టీ సింబల్ తో గెలిచిన ఎంపీలను, ఎమ్మెల్యేలను… బెదిరించో – ప్రలోభపెట్టో… తమ పార్టీలోకి చేర్చుకోవడం దిగజారుడు రాజకీయం అవునో కాదో కిషన్ రెడ్డే చెప్పాలి. దేశంలో ఏ సమస్య వచ్చినా దాన్ని మాతాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకునే పార్టీ అని విమర్శలు ఎదుర్కొంటున్న పార్టీలో ఉంటూ.. కిషన్ రెడ్డి ఇలా దిగజారుడు రాజకీయాల గురించి మాట్లాడటం.. దిగజారి మాట్లాడటమే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఇక కుటుంబ పాలన టాపిక్ ఎతీన కిషన్ రెడ్డి… కుటుంబ పార్టీల వల్లే ఏపీలో అభివృద్ధి జరగడం లేదని సెలవిచ్చారు! దీంతో… 2014 ఎన్నికల్లో ఏపీలో కుటుంబ పార్టీ అని నేడు చెబుతున్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. మోడీ – బాబు లుంగేసుకుని తిరిగినప్పుడు.. టీడీపీ అనేది కుటుంబ పార్టీ అన్నవిషయం కిషన్ రెడ్డికి తెలియదా.. లేక, అప్పటికి అంత జ్ఞానం లేదా?.. అంటూ కిషన్ రెడ్డి కామెడీకి కౌంటర్స్ వేస్తున్నారు ఏపీ జనాలు!

విచిత్రం ఏమిటంటే… ఇంత కామెడీ పండించిన కిషన్ రెడ్డి.. వారి చేతుల్లో ఉన్న అసలు విషయాలు మాత్రం మరిచినట్లు నటించేప్రయత్నం చేశారు! దీంతో… ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా అనే హామీ, ప్రైవేటుపరం చేయాలని మోడీ తెగ తొందరపడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం, విశాఖ రైల్వే జోన్… వంటి విలువైన విషయాలను, ఏపీ అభివృద్ధిలో కీలకభూమిక పోషించే హామీలను – కేంద్రప్రభుత్వం చేతుల్లో ఉంచుకుని… ఏపీకొచ్చి అభివృద్ధి లేదు అని చెప్పడం కిషన్ రెడ్డికే సొంతం అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!