వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటా నిర్వహించే అధికారిక పర్యటన స్విట్జర్లాండ్ టూర్. అక్కడి దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సమావేశాల్లో ఏటా పాల్గొనడం ఓ ఆనవాయితీగా పెట్టుకున్నారు. దాదాసు 14 నుంచి 18 మంది అధికారిక బృందంతో వారం రోజుల పాటు చంద్రబాబు దావోస్‌లో మకాం వేస్తారు. దావోస్ పర్యటన ఫలితం ఎలా ఉంటుందన్నది మనకు తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన పెట్టుబడుల కన్నా..ఈయన చేపట్టిన పర్యటనల ఖర్చే అధికం అంటూ చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటారు.
ఈ సారి కూడా ఆయన దావోస్ పర్యటనకు రెడీ అయిపోయారు. ఈ నెల 20న ఆయన స్విట్జర్లాండ్‌కు బయలుదేరి వెళ్లబోతున్నారు. ఇందులో కొత్తేముందీ అనుకుంటున్నారా? చంద్రబాబు దావోస్ పర్యటనలో ఈ సారి కేంద్రం జోక్యం చేసుకుంది. వారం రోజుల టూర్ ఎందుకంటూ, దాన్ని నాలుగు రోజులకే కుదించింది. 14 మంది వందిమాగధులు వద్దంటూ, ఆ సంఖ్యను నలుగురికే కుదించింది.
కారణాలేమైనప్పటికీ- అసలే చంద్రబాబు కేంద్రంపై ఒంటి కాలి మీద లేస్తున్నారు. అయిన దానికి, కాని దానికీ కేంద్రాన్ని ఆడిపోసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో..చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన దావోస్ పర్యటనలో కేంద్రం వేలు పెడితే చంద్రబాబు ఇంకెంతగా రెచ్చిపోతారో కదా! ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన తొలి ఇన్నింగ్‌లో కూడా వరుసగా దావోస్‌కు వెళ్లొచ్చారు. విభజన తరువాత కూడా ఈ నాలుగేళ్లూ క్రమం తప్పకుండా వెళ్తున్నారు.
దావోస్ పర్యటన నిజంగా చంద్రబాబుకు ప్రీతిపాత్రమైనదే. ఎందుకంటే- ప్రచారానికి బాగా స్కోప్ ఉన్న టూర్ అది. ఎంత వీలైతే అంత ప్రచారం. పైగా ఇది ఎన్నికల సంవత్సరమాయె. ఇలాంటప్పుడు దావోస్ పర్యటనలో జోక్యం చేసుకోవడాన్ని కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోగలరు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్నారని దుమ్మెత్తి పోయవచ్చు.