వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఆ సీనియర్ నేతకు ఊహించని షాక్

తెలంగాణాలో వాడీ వేడిగా సాగిన ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ టెన్షన్ మొదలైంది. తెలంగాణ రిజల్ట్స్ ఎఫెక్ట్ రాష్ట్రం మీద ప్రభావం చూపే అవకాశం ఉందని నాయకులు, కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత సంప్రదాయానికి భిన్నంగా అభ్యర్థులను ముందే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి తర్వాత తొలి జాబితా అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. దీంతో పార్టీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. చంద్రబాబు ప్రతిసారి సర్వే చేయించి నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్వే ఆధారంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో అత్యధిక శాసనసభ స్థానాలున్న తూర్పు గోదావరిజిల్లాపై నేతలు దృష్టి సారించారు. వైసీపీ అధినేత జగన్ 19 స్థానాలకు గాను 15 స్థానాల్లో అభ్యర్థులకు దాదాపు స్పష్టత వచ్చింది. ఇక టీడీపీ విషయానికి వస్తే జిల్లాలో ముమ్మిడివరం, జగ్గంపేట, రామచంద్రాపురం, మండపేట సిట్టింగ్ లకు మళ్ళీ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ నుండి టీడీపీలో చేరిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి షాక్ తగలనుంది. ఆయన ఎమ్మెల్యే బరి నుండి తప్పించి…ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, కొత్తవారికి అవకాశం కల్పించాలనే డిమాండ్ ఉన్నట్టు అంతర్గత వర్గాల సమాచారం.

కాగా వరుపుల సుబ్బారావు 1989 నుండి 5 సార్లు ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. 2009 లో కాంగ్రెస్ నుండి, 2014 వైసీపీ నుండి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. రెండేళ్ల తర్వాత వైసీపీ నుండి టీడీపీలోకి మారారు. 1955 లో ప్రత్తిపాడు నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో సుమారు లక్ష తొంబై ఆరువేల మంది ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా 55 శాతం మంది ఉన్నారు. కాపులు 25 శాతం ఉండగా 22 శాతం మిగిలినవారు ఉన్నారు.

వరుపుల సుబ్బారావు కాపు సామజిక వర్గానికి చెందిన నేత. బీసీల తర్వాత కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న ఆ నియోజకవర్గంలో వరుపుల ప్రజల్లో మంచి ఇమేజ్ దక్కించుకోలేకపోయారు. ఆయన ఎమ్మెల్యే అయ్యాక కనీస అభివృద్ధి కూడా చేయలేదని విమర్శ ఉంది. లేటరైట్ మైనింగ్, అక్రమ రావణాలతో రోడ్లు ధ్వంసం అయ్యాయి. పార్టీ మారాక కూడా మైనింగ్ ఎందుకు అరికట్టలేకపోయారు, మైనింగ్ కంపెనీలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలోనే ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్.

ఇక ఇదే జిల్లాలో టీడీపీ ఎంపీ మాగంటి మురళి మోహన్ కూడా ఈసారి తన కోడలికి అవకాశం కల్పించాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఆయన కోడలు రూపాదేవి ప్రస్తుతం టీడీపీ స్టేట్ సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజమండ్రి సిటీ లేదా రూరల్ సెగ్మెంట్స్ లో ఒకచోట నుండి టికెట్ ఇవ్వాలని ఆమె ఇప్పటికే సీఎంని అభ్యర్ధించినట్టు తెలుస్తోంది. మరో మూడు స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. అంతేకాదు కేడర్ లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తప్పించాలని పార్టీలోనే అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. అభ్యర్థుల బలాబలాలు, నియోజకవర్గంలో పార్టీకి ఉన్న ఇమేజ్ వంటి పలు అంశాలు దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.