ఇంటి పోరు… ఉండి నియోజకవర్గంలో చీలిన పసుపు జెండా!

చంద్రబాబుకు అంతర్లీనంగా ఇప్పుడు రెండు రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. అందులో ఒకటి “ఇంటిపోరు” కాగా.. మరొకటి “కూటమిలో కుంపటి”! ప్రస్తుతం ఈ రెండు సమస్యలూ చంద్రబాబు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా కూటమిలో భాగంగా సుమారు 31 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు టిక్కెట్లు దొరకని పరిస్థితి నెలకొనడం.. ఆ సమయంలో బాబు వారితో ముందుగానే ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో పాటు.. సొంతపార్టీలోనే టిక్కెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడం మరోసమస్యగా చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రెబల్స్ తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ అభ్యర్థిని గెలవనివ్వమని కుండబద్దలు కొట్టి చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే కూటమికి కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో వర్మ రూపంలో ఒక సమస్య తెరపైకి వచ్చినా… ఆయన కూల్ అయ్యారని అంటున్నారు. మరోపక్క… కూల్ అయినట్లు కనిపిస్తారు అంతే… నామినేషన్స్ విత్ డ్రా తేదీ ముగిసాక అసలు కథ స్టార్ట్ అవుతుందని మరొకరు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిపోరు చినికి చినికి గాలివానగా మారింది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఫస్ట్ లిస్ట్ లో మంతెన రామరాజుకు టికెట్ ప్రకటించారు చంద్రబాబు. దీంతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు వర్గం ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సుమారు రెండు దశాబ్ధాలుగా పార్టీకోసం పనిచేస్తున్నానని.. తనకే టిక్కెట్ ఇవ్వాలని శివరామరాజు డిమాండ్ చేస్తున్నారు. గతంలో టీడీపీకి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థి లేకపోవడంతోనే తాను ఉండిని వదిలి పార్టీ కోసం త్యాగం చేసినట్లు చెబుతున్నారని తెలుస్తుంది.

ఈ సమయంలో అదే అవకాశంగా భావించి తనకు పూర్తిగా ఉండి నుంచి తప్పించాలని చూడటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు శివరామరాజు సిద్ధమై ప్రచారం కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా కాళ్ల మండలం నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూట్టారు. దీంతో… ఉండి నియోజకవర్గంలో టీడీపీ కేడర్ రెండుగా చీలిందని తెలుస్తుంది. ఫలితంగా… సీనియర్ టీడీపీ నేతలంతా శివరామరాజు వైపు, జూనియర్స్ అంతా రామరాజువైపు వెళ్తున్నారని చెబుతున్నారు.

మరోపక్క స్థానిక జనసేన కేడర్ తో పాటు బీజేపీ కార్యకర్తలతో కూడా శివరామరాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అక్కడ కూడా చీలిక వచ్చి, వారు కూడా ఈ రెబల్ తో తిరుగుతున్నారని తెలుస్తుంది. దీంతో… ఉండిలో కూటమికి బ్యాడ్ న్యూస్ అనే అంటున్నారు పరిశీలకులు. ఇది కచ్చితంగా వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుకి గుడ్ న్యూస్ అని చెబుతున్నారు. పైగా… ఈ విషయం ఇప్పటికే చంద్రబాబు చేయి దాటిపోయిందని అంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఈ విషయాలపై రెబల్ అభ్యర్థి శివరామరాజు స్పందించారు. ఇందులో భాగంగా… ఉండితో తనకు విడదీయరాని అనుబంధం ఉందని.. ఉండి ప్రజలు 2009, 2014 ఎన్నికల్లో ఎంతో ఆదరణ చూపించారని తెలిపారు. 2019లో అధిష్టాణం నిర్ణయం మేరకు నరసాపురం ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని.. తిరిగి 2024లో ఉండి నుంచి పోటీచేస్తానని తెలియజేసినా పట్టించుకోలేదని.. తనకు కనీసం ఎలాంటి సమాచారం లేకుండా టిక్కెట్ ప్రకటించేశారని.. ఆ విషయం తనకు చాలా బాధ కలిగించిందని స్పష్టం చేశారు.

దీంతో… చంద్రబాబు స్వయంకృతాపరాధాల్లో దీన్నీ ఒకటిగా భవిస్తున్న పరిశీలకులు… ఉండిలో టీడీపీ జెండా మాత్రమే కాదు, కూటమి కూటమే రెండుగా చీలిందని.. ఇది కచ్చితంగా కూటమికి బ్యాడ్ న్యూసే అని అంటున్నారు!!