సైకిలెక్కనున్న నాలుగో ఎమ్మెల్యే… హైదరాబాద్ లో ఉంటుంది అందుకేనట!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి వ్యతిరేకంగా ఓటువేశారన్న కారణంగా వైసీపీనుంచి బహిష్కరణకు గురైన నలుగురు ఎమ్మెల్యేలలో ఇప్పటికే ముగ్గురు టీడీపీ వైపు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇప్పటికే నియోజకవర్గం కూడా ఖాయం చేశారు చంద్రబాబు. ఈ క్రమంలో నాలుగో ఎమ్మెల్యే కూడా చంద్రబాబుని కలిశారు.

అవును… వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా చంద్రబాబుని కలిశారు. ఆమె వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కొత్తలో జనసేన తరఫున పోటీ చేస్తారని వినిపించింది. కానీ ఆమె సడెన్ గా తన భర్తతో కలసి శ్రీకాకుళంలో పర్యటిస్తున్న చంద్రబాబుని తాజాగా కలవడం చర్చనీయాంశం అయింది. దీంతో త్వరలో ఆమె సైకిల్ ఎక్కడం ఖాయమని అంటున్నారు.

దీంతో టీడీపీలో టిక్కెట్ రానివారంతా జనసేనలో జాయిన్ అవుతుంటే… వైసీపీ బహిష్కరించిన వారంతా టీడీపీకి దగ్గరవుతున్నట్లుననరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీదేవి పోటీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అందుకోసమే ఆమె బాబుని కలిశారు అని చెబుతున్నారు. బాబుతో ఏమి మాట్లాడారనే విషయంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ… ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి వస్తే ఆమెకు తాడికొండ సీటు దక్కుతుందా అన్న చర్చ మాత్రం మొదలైంది. అక్కడ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు.

శ్రావణ్ కుమార్ టీడీపీ నుంచి 2014లో గెలిచారు. 2024లో కూడా తానే పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారు. అయితే ఇపుడు ఉండవల్లి శ్రీదేవి టికెట్ అడిగితే శ్రావణ్ కుమార్ కి ఎక్కడ అకామిడేట్ చేస్తారు అన్నది చర్చగా ఉంది. ఇదే సమయంలో 2004, 2009లలో రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ వైసీపీ అభ్యర్ధిగా ఉంటారని అంటున్నారు.

అయితే చంద్రబాబుని కలిసిన విషయంపై సమాధానం చెప్పకుండా దాటవేశారు ఉండవల్లి శ్రీదేవి. ప్రస్తుతం ఆమె తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అయితే అక్కడ వైసీపీ ఇన్ చార్జిని పెట్టి అన్ని కార్యక్రమాలు ఆయన ద్వారా నడిపిస్తోంది. ఎమ్మెల్యే శ్రీదేవి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. నాలుగున్నర నెలలపాటు తన భవిష్యత్ రాజకీయాల గురించి ఆలోచించానని, త్వరలో ఏ పార్టీలో చేరేది చెబుతానన్నారు ఉండవల్లి శ్రీదేవి!

ఈ సందర్భంగా… కష్టకాలంలో తనకు లోకేష్ అండగా నిలిచారని చెప్పారు. తనపై పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత వైసీపీ గూండాలు దాడులు చేశారని.. ఆ సమయంలో తనకు ఏపీలో రక్షణ లేదని, అందుకే ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నానని చెప్పుకొచ్చారు. తనకు రక్షణ కల్పించాలని చంద్రబాబుని అడిగినట్లు తెలిపారు. కాగా… చంద్రబాబు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.