హైకోర్టులో కీలక పరిణామం… మందు నుయ్యి వెనుక గొయ్యి!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఇప్పటికే చాలా లోతు కూరుకుపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ స్కాం కేసులో సీఐడీ పగడ్బందీగా ఉందని.. సాక్ష్యాలన్నీ పక్కాగా సేకరించిందని.. అందుకే ఈ కేసులో బాబుకు ఎక్కడా రిలీఫ్ దక్కడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ హైకోర్టులో జరిగిన ఒక కీలక పరిణామం… చంద్రబాబు పరిస్థితిని మరింత ఇరకాటంలో పెట్టేసిందని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ… ఇది కక్షపూరిత చర్య అని, ప్రభుత్వం బాబుపై కక్ష గట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరికి బాబు తరుపు న్యాయవాదులు కోర్టులో సైతం ఇలాంటి వాదనను వినిపిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంటరయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారం మరింత రసకందాయంలో పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును… చంద్రబాబు కోర్టు కేసుల వ్యవహారంలో ఈ రోజు కీలక పరిణామం జరిగింది. ఇప్పటి వరకూ కక్ష సాధింపు అంటూ కోడై కూస్తున్న వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ విచిత్రమైన మలుపు తీసుకుంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి ఏపీ హైకోర్టుని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు… చంద్రబాబు సహా 44మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఇదే సమయంలో… నోటీసులు జారీ చేసే ముందు సీఐడీ తరపున రాష్ట్ర ప్రభుత్వ వివరణను హైకోర్టు కోరింది. దీంతో… రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. కేవలం స్కిల్ స్కాం ఒక్కటే కాదు.. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్ని కూడా సీఐడీ పరిధి నుంచి తప్పించి, సీబీఐకి అప్పగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో హైకోర్టు చంద్రబాబు సహా ప్రతివాదులకు నోటీసులిచ్చింది. సీబీఐ ఎంక్వయిరీపై వారి అభిప్రాయాలు చెప్పాలని కోరింది.

దీంతో ఇది టీడీపీ అతిపెద్ద సమస్యగా మారిపోనుందని అంటున్నారు విశ్లేషకులు. కారణం… ఈ కేసులన్నీ సీబీఐ పరిధిలోకి వెళ్తే ఆయన ఇంకా కూరుకుపోతారని అంటున్నారు. కారణం… ఒక్కసారి సీబీఐ ఎంటరై అరెస్ట్ చేసినా, జైలుశిక్ష పడినా ఇక సానుభూతి అనే టాపిక్కే ఉండదు. ఎన్నికల్లో సానుభూతి కోసం రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం సాధ్యం కాదు.

సపోజ్.. ఫర్ సపోజ్… ఈ కేసులను సీబీఐకి ఇవ్వొద్దు అని ప్రతివాదులంతా కోరినా కూడా చంద్రబాబుకి సమస్యే! కారణం… సీబీఐ విచారణ వద్దు అన్నారంటే.. ఏపీ సీఐడీ విచారణను పరోక్షంగా ఒప్పుకున్నట్టే లెక్క. అంటే… సీఐడీ పారదర్శకంగానే విచారణ చేస్తుందని చెప్పకనే చెప్పినట్లు. ఫలితంగా… రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అని అనడానికి ఇక నో ఛాన్స్!

ఈ లెక్కన చూసుకుంటే… ఉండవల్లి పిటిషన్ తో చంద్రబాబు పరిస్థితి పుర్తిగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. దీంతో… సీబీఐ ఎంక్వయిరీకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చంద్రబాబుకే ఇరకాటం అని అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే… ముందు నుయ్యి – వెనుక గొయ్యి టైపు అన్నమాట!